
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి అంటే ముందుగా గుర్తొచ్చేది ఆయన నటన, డ్యాన్స్‌లు, ఫైట్‌లు, వెండితెరపై ఆయన చేసే సందడి అయితే.. ఆ తర్వాత గుర్తుకు వచ్చేది ఆయన చేసే సేవా కార్యక్రమాలు. ఇప్పటికే చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఏంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు చిరంజీవి. తాజాగా ఆయన మరో సరికొత్త సేవా కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.
భవిష్యత్తులో పేద పిల్లలకు ఉచిత విద్య అందించమే తన లక్ష్యమని చిరు తెలిపారు. ఉగాది పండగ సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘కుటుంబంలోని ఒక వ్యక్తి విద్యావంతుడైతే.. ఆ ఫ్యామిలీ అంతా బాగుపడుతుంది. ఆ దిశగానే అడుగులు వేస్తున్నా. చిరంజీవి స్పూర్తితోనే ‘అగరం ఫౌండేషన్’ స్థాపించి పేద పిల్లలకు ఉచితంా ఉన్న విద్య అందిస్తున్నానని నటుడు సూర్య చెబుతూ ఉంటాడు. విద్యాదానం నన్నెంతో మోటివేట్ చేసింది. ఒకప్పుడు నేను నీకు ఆదర్శం.. ఇప్పుడు నువ్వే నాకు స్పూర్తి అని సూర్యతో అన్నాను. తెలుగు రాష్ట్రాల పిల్లలకే కాదు అవసరం ఉన్న అందరికీ ఉచితంగా విద్యను అందించాలనుకుంటున్నా’’ అని చిరంజీవి అన్నారు.