Reading Time: < 1 minute

ఇటీవల జరిగిన టి-20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో్ విజేతగా నిలిచిన టిం ఇండియా ప్రస్తుతం మంచి ఫామ్‌లో దూసుకుపోతుంది. మూడు ఫార్మాట్‌లలో రాణిస్తుంది. అయితే బ్యాటింగ్ పరంగా జట్టు పటిష్టంగా ఉన్నా… బౌలింగ్‌లో అప్పుడప్పుడూ తేలిపోతున్నారు. ఎవరు ఎలా బౌలింగ్ చేస్తున్నా.. పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా మాత్రం ఎప్పుడు బాల్ అందుకున్న.. జట్టుకు ఉపయోగపడేలా బౌలింగ్ చేస్తూ.. జట్టును ఆదుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

బుమ్రా తర్వాత అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరని అశ్విన్ పేర్కొన్నాడు. ‘‘వైట్ బాల్ క్రికెట్‌లో బ్యాటింగ్ పరంగా టీం ఇండియాకు భవిష్యత్తులోనూ ఇబ్బంది లేదు. రానున్న దశాబ్ధంలో భారత జట్టు ఈ ఫార్మాట్‌లో ట్రోఫీలు గెలుచుకుంటుంది. ఈ విషయంలో నాకు ఎలాంటి సందేహమూ లేదు. బ్యాటింగ్ విభాగంలో భారత జట్టు చాలా బలంగా ఉంది’ అని అశ్విన్ అన్నాడు.

‘‘కానీ బుమ్రా తర్వాత పరిస్థితి ఏంటి? ఈ విషయంలో నాకు ఆందోళనగా ఉంది. బ్యాటింగ్ ఉన్నంత ఆకర్షణీయంగా బౌలింగ్ ఉండటం లేదు. దీంతో రాబోయే తరంలో పిల్లలు బౌలింగ్ ఎంచుకోకపోవచ్చు. ఎందుకంటే.. బ్యాటర్లు కొట్టే సిక్సులు, ఫోర్లు వారిని అలరిస్తాయి. బౌలింగ్‌తోనూ మనం టోర్నమెంట్లు, సిరీస్‌లు గెలవొచ్చని ఎవరు గ్రహిస్తారు’’ అని అశ్విన్ వివరించాడు.