
ప్రజలను సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా ఏకం చేసి వారిలో మానవతావిలువల పెంపుకు దోహదపడడానికి పూర్వం పెద్దలు వివిధ పండుగలను ఏర్పరచారు. ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క నేపథ్యంగా.. విశిష్ఠతను చేకూర్చారు. కొన్ని పండుగలు దేవుళ్ళ ప్రాశస్త్యాన్ని చాటిచెప్పి వారికి చేరువచేసేవి. అయితే, ఇంకొన్ని పండుగలు కుటుంబ బంధాలు, అన్నాచెల్లెల్ల అనురాగాన్నీ పెంచేవి. మరికొన్ని పండుగలు ప్రకృతినీ, నేల తల్లినీ, వ్యవసాయాన్నీ పూజింపజేసే పండుగలను పుట్టించి వాటికి గొప్పగొప్ప పేర్లు పెట్టి ఆచరింపజేశారు. అలాంటి పండుగల్లో తెలుగు వారికి తొలి పండుగగా ‘ఉగాది’ ఆవిర్భవించింది. దీనికి నేపథ్యం సృష్టిమొదలై మానవులు చైతన్యం పొంది, నాగరికతకు ఎదిగిన రోజు ఉగాది (యుగ+ఆది=యుగాది) పర్వదినంగా చెప్పారు. తెలుగువారికి చాంద్రమాన కొత్త సంవత్సరం మొదటిరోజు చైత్రశుద్ధ పాడ్యమిన ఈ పండుగను జరుపుకోవడం సంస్కృతిగా మారింది. జ్యోతిష్యశాస్త్ర ప్రకారంగా ఉగాది పండుగను నిర్ణయించారు. చైత్రమాసంలో మొదటి పక్షమైన శుక్లపక్షంలో తొలితిథి అయిన పాడ్యమి బ్రాహ్మిముహూర్తం నుంచి ఉగాది మహాపర్వ దినాన్ని శాస్త్రయుక్తంగా ప్రజలు నిర్వహించి తరించాలని పెద్దలు ఉపదేశించారు. అయితే ఈ పండుగకు జ్యోతిష్య శాస్త్రాన్ని పట్టాభిషేకం చేశారు. కొత్త సంవత్సరంలో జ్యోతిష్యశాస్త్ర (పంచాంగం) ప్రకారం నడుచుకుంటే ఏ ఇడుములు రావని చెప్పారు.
‘పంచాంగం’: జ్యోతిష్యశాస్త్రమనే పంచాంగ శ్రవణాన్ని పాటింపును చేశారు. వ్యక్తుల ఆదాయ, వ్యయాలు, రాజపూజ్య, అవమానాలు, కందాయఫలాలు, రాశిఫలాలు, తెలియజెప్పే పంచాంగం వినడాన్ని పండుగనాడు ఆనవాయితీని చేశారు. అలాగే కొత్త సంవత్సరంలో దేశ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామాల భవిష్యత్తులు, మంచిచెడులను, కొత్త సంవత్సరంలో తారసపడే పరిణామాలు, శుభాశుభ ఫలితాలు పంచాంగంవల్ల తెలుస్తాయి. పంచాంగం అనగా భగవంతుని పంచ అంగాలుగా రుషులు చెప్పారు. తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగంగా పంచాంగాన్ని నిర్వచించారు. పంచాంగ శ్రవణంవల్ల గంగాస్నానం పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ‘జ్యోతిష్యానికి ఇంత నమ్మకం ఎలా వచ్చింది?’: జ్యోతిష్య, ఖగోళ గణిత, భూగోళ, పర్యావరణ శాస్త్రాలలో అపార ప్రజ్ఞ కలిగిన విశేషశేముషీ దురంధరుడు వరాహమిహిరుడు.. విక్రమార్కునిగా పిలువబడే రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలోని నవరత్నాలలో ఒకడుగా ప్రసిద్ధి చెందాడు. తన మహారాజు విక్రమాదిత్యుని కుమారుడు వరాహ కారణంగా మరణిస్తాడని సందేహం లేకుండా జ్యోతిష్యశాస్త్రం మీద తనకున్న అపారపట్టు, ప్రతిభ, విశ్వాసంతో ముందుగానే చెప్పాడు. ఆ మాటలు నిజం కాగా చక్రవర్తి వరాహమిహిరుని మనస్ఫూర్తిగా అభినందించాడు. దీంతో గెలిచింది నేను కాదు! జ్యోతిష్యశాస్త్రం అని వరాహమిహిరుడు సవినయంగా రాజుకు చెప్పాడు. అప్పటినుంచి జ్యోతిష్యశాస్త్రాన్నీ, జ్యోతిష్య పండితులను అపారగౌరవంతో ప్రజలు నమ్ముతూ భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలను చెప్పే మహత్తర గ్రంథంగా, మానవాళికి దిక్సూచిగా పంచాంగాన్నీ, జ్యోతిష్యశాస్త్రాన్నీ చూస్తున్నారు. అందుకే ఉగాదినాడు పంచాంగ శ్రవణాన్ని పవిత్ర దైవకార్యంగా ప్రజలు పెట్టుకున్నారు.
2000 ఏళ్లుగా… ఇక్ష్వాకుల నుంచి: ఈ నేపథ్యంలో సుమారు 2000 ఏళ్ళనాడు విక్రమార్క, శాలివాహన చక్రవర్తుల శకాలు ఉగాది నుంచే ప్రారంభమై తిథి, వార, నక్షత్ర, పక్ష, మాసాదులతో కూడిన పంచాంగం రూపొందించబడి ఇక్ష్వాకుల రాజులపాలనా కాలం నుంచి వాడుకలోకి వచ్చిందని చరిత్ర నిర్ధారిస్తున్నది. ఉగాది విశిష్ఠత: ఉగాదినాడు తెల్లవారు జామున తైలాభ్యంగనం దైవారాధనం, నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి), ప్రపాదాన ప్రారంభం (చలివేంద్రాలు నెలకొల్పడం), పంచాంగశ్రవణంతో పాటు ప్రతీ ఒక్కరూ కొన్ని విధులూ, నియమాలు పాటించాలని, అలాగే ప్రాచీన రుచులను.. ప్రబోధం చేశారు. ‘ఉగాది పచ్చడి: మనిషి జీవితానికి ప్రతీకగా ఉగాది పచ్చడిని ప్రవేశపెట్టారు. తీపి, ఉప్పు, పులుపు, చేదు, వగరు, కారం అనే షడ్రుచుల నమ్మేళనంగా.. జీవితంలో కష్టం, సుఖం, ఆనందం, విషాదం ఇంకా ఎన్నో కలగలసి ఉంటాయనీ, వాటన్నింటినీ సమానంగా స్వీకరించి నిబ్బరంగా, గంభీరంగా ఉండాలని చెప్పడానికి ప్రతీకగా దీన్ని అందరికీ ఉగాది ఉత్కృష్టమైన రోజున సేవనం చేశారు. కాగా ఈ పచ్చడిని వేపపువ్వు, కొత్తబెల్లం, కొత్త చింతపండు పులుసు, మామిడికాయ ముక్కలు (కొన్ని ప్రాంతాల్లో అరటి పళ్ళ గుజ్జును కూడా చేర్చి పచ్చడిగా తయారుచేసి తాగుతారు. ఈ విధమైన సనాతన సంస్కృతి, సంప్రదాయంతో ఉగాదికి నిండుదనం చేకూరుస్తారు.
పండుగ ఆచరణ: ఇళ్ళద్వారాలకు మామిడి ఆకుల తోరణాలు కట్టడం, తలస్నానం చేయడం, నూతనవస్త్రాలు ధరించడం, పిండి వంటకాలు చేయడం పూర్వంనుంచి వస్తున్న ఆచారం. వసంత మాసం, ప్రకృతి సౌందర్యాలతో కూడిన ఆహ్లాద పూరిత (వాతావరణాలను) మానవుల సుఖసంతోషాల కోసం ఆహ్వా నించే పండుగ ఉగాది పండుగ. సంవత్సరంలోని రెండు ఆయణాల్లో మొదటిదైన ఉత్తరాయణంలో ఉన్న మూడు రుతువుల్లో తొలిదైన వసంత రుతువులో ఈ పండుగ వస్తుంది. ప్రకృతి మాత నిలువెల్లా ఆకుపచ్చని పట్టుపీతాంబరధారినియై ఆకుపచ్చ వర్ణస్వర్ణాభరణ అలంకృతయై మహెూజ్వల తేజో విరాజితకాంతితో సందర్శితయై పులకింపజేస్తుంది. ప్రకృతి చైతన్యాన్నీ, నూతనత్వాన్నీ సంతరించుకొని, ఆకురాల్చిన మోడుదశకు తిలోదకాలిచ్చి చిగురించిన వనాలు, చల్లనిగాలులు, నిర్మల ఆకాశం, విరబూసిన రంగురంగల పూవుల సుగంధ పరిమళాలు, వివిధ రకాల పక్షుల ఆనందిత కిలకిల రావాలు, కోయిలల సంబర కుహుకుహూ రాగాలూ, ఎటుచూసినా ప్రకృతి మాత శోభాయమానంగా కనిపిస్తూ హృదయాలను పరవశింపజేస్తుంది.
తాళ్ళపల్లి యాదగిరి గౌడ్ 99497 89939