
హైడ్రా కూల్చివేతలతో హైరాన పడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో చోటు చేసుకున్న నిరుపేదల ఇళ్ళకూల్చివేతల ఘటన మాయని మచ్చగా మిగలనుంది. రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా ప్రకంపనలు సృష్టించిన వెలుగుట్ల కూల్చివేతల ఉదంతం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్ఠకు మాసకబారేటట్లు చేయగా వందలాది మంది నిరుపేదల జీవితాల్లో కారుచీకట్లను కమ్మింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తోపాటు ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులకు ముచ్చెమటలు పట్టించి దాదాపు పక్షం రోజుల పాటు ఉక్కిబిక్కిరి చేసింది. ఈ ఘటనతో కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అభాసుపాలైంది. రాష్ఱ రాజధానిలో బఫర్ జోన్‌లో నిర్మించిన అనేక అక్రమ కట్టడాలను హైడ్రా పేరుతో బుల్డోజర్‌తో నేలమట్టం చేస్తుండటం, దీనికి తోడు మూసీ సుందరీకరణతో పలు బహుళ అంతస్తులను కూల్చివేస్తామని నోటీస్‌లను జారీ చేయడం, రాష్ట్రంలో పలు జిల్లాలో కూడా అక్రమ కట్టడాల పేర్లతో కూల్చివేస్తున్న నేపధ్యంలో గత నెల 24న ఖమ్మం నగర శివారులోని వెలుగుమట్ల రెవెన్యూ గ్రామంలోని భూదాన భూముల్లో అక్రమంగా ఇళ్ళ నిర్మాణం చేసుకున్నారనే కారణంతో సుమారు 750 మంది నిరుపేదల ఇళ్ళను అమాననీయంగా, నిర్దాక్షిణ్యంగా కూల్చివేసిన సంఘటన రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్‌ను కుదిపేసింది. వెలుగుమట్ల గ్రామంలో కల్వల రాజరామారావు అనే భూస్వామికి సర్వే నెం. 147, 148, 149లో మొత్తం 62.07 ఎకరాల భూమి ఉంది.
ఈ భూమిలో 31.07 ఎకరాల భూమిని 1953లో అచార్య వినోభాబావే పిలుపుమేరకు భూదాన బోర్డుకు దానం చేశారు. మిగిలిన 30 ఎకరాల భూమిని ఇతర రైతులకు విక్రయించి రిజిస్ట్రేషన్ చేయించారు. భూదాన బోర్డుకు దానంచేసిన భూమిని అప్పట్లో 13 మంది పుట్టకొట్ట రైతులకు సాగుకోసం ఆనాటి రెవెన్యూ అధికారులు పంపిణి చేశారు. అయితే ఈ భూమి వ్యవసాయానికి అనుకులంగా లేకపోవడం, గుట్టలతో, దట్టమైన అడవితో కూడుకోని ఉండటంతో వారు వ్యవసాయం చేసుకోలేదు. దీనిని గమనించిన అప్పటి రెవెన్యూ అధికారులు రైతులకు ఇచ్చిన పట్టాలను రద్దు చేసి తిరిగి ప్రభుత్వం అధీనంలోకి తీసుకున్నారు. మొత్తం 31.07 ఎకరాల భూమిలో 10.20 భూమిని జర్నలిస్టుల కోసం కేటాయించి తిరిగి రద్దు చేశారు. ఈ రద్దు చేసిన భూమిలో అయిదు ఎకరాల భూమిని కెజిబివి కళాశాలకు, మరో అయిదు ఎకరాల భూమిని మోడల్ స్కూల్‌కు కేటాయించారు. మిగిలిన భూమిలో దాదాపు పదేళ్ళ క్రితం నుంచి దశలవారీగా నిరుపేదలు గుడిసెలు వేసుకొని ఆక్రమించడం, పక్కా ఇళ్ళను నిర్మించుకోవడం ప్రారంభించారు.
దీనికి సిపిఐ (ఎంఎల్), యుసిసిఆర్‌ఐ అనుబంధ గ్రామీణ పేదల సంఘం (ఒపిడిఆర్) సారథ్యం వహించింది. మొదట్లో పేదలకు నిలువనీడను కల్పించాలనే తపన ఉన్నప్పటికీ ఇక్కడ ఏర్పాటు చేసిన వినోభా భూదాన్ వెల్పేర్ సొసైటీ కమిటీలోకి పార్టీకి సంబంధం లేని వారు చేరడం, ఆ కమిటీలోని సభ్యులకు డబ్బు కాంక్ష పెరగడంతో అవినీతి అక్రమాలు భారీ ఎత్తున చోటుచేసుకున్నాయి. అసలు వెలుగుమట్లలో ఉన్న భూదాన భూములు 31.07 ఎకరాలా, లేక 62.07 ఎకరాలా? అనే విషయంలో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడంలో కూడా రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా విఫలం చెందింది. కొందరు అధికారుల అత్యుత్సాహం సమస్యను మరింత జటిలం చేసింది.
పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తలేదు. ఈ భూమి వివాదంపై హైకోర్టులో పలు కేసులు నమోదు అయి ఉండటంతోపాటు భూపరిపాలన ప్రత్యేక కమిషనర్ ఈ ఏడాది జనవరి 17న జారీ చేసిన సుమోటో ఆదేశాలతో ఫిబ్రవరి 24న ఆపరేషన్ బుల్డోజర్ చేపట్టి రెండు రోజుల వ్యవధిలో 750 ఇళ్ళను నేలమట్టం చేశారు. ముందస్తుగా ఎలాంటి నోటీస్‌లు ఇవ్వకుండా రాత్రికి రాత్రే బలవంతంగా ఇళ్ళ నుంచి బైటికి పంపించి ఇళ్ళను కూల్చివేయడంతో బాధితులంతా కన్నీళ్ళతో లబోదిబోమన్నారు. నిబంధనల ప్రకారం స్థ్దానిక తహసీల్దార్ ప్రతి ఇంటికీ నోటీస్ అందించి వారికి గడువు ఇవ్వాలి. వారు ఇంట్లో లేకపోతే గోడకు అతికించి వెళ్ళాలి.
కాని ఇక్కడ ఇలాంటివి ఏమి జరగలేదు. పైగా ఈ చర్యను అడ్డుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. భూదాన్ భూదందాపై ఇప్పటికే పోలీసులు 24 కేసులను నమోదు చేసి 60 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అందులో ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్టు చేసి వారి ఆస్తులను అటాచ్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. పోలీసులు చెప్పిన ప్రకారం నిరుపేదల నుంచి రూ. 3 కోట్ల వరకు వసూళ్ళు చేశారని, వాటిని రికవరీ చేసి బాధితులకు తిరిగి అప్పగిస్తామని పోలీసు అధికారులు ప్రకటించడం నష్టపోయిన బాధితులకు కొంత ఊరడింపుగా మారినప్పటికీ కూల్చివేతలో తీవ్రంగా నష్టపోయిన పేదల కన్నీళ్ళను మాత్రం ఎవ్వరూ తూడ్చలేనిది. కూల్చివేసిన చోటే ఇంటి స్థలాలు ఇవ్వడం తాత్కాలిక ఊరడింపు చర్యేగాని నిరు పేదల గుండెకు అయిన గాయం మాత్రం ఎప్పటికీ మానని పుండుగానే మిగులుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇళ్ళ కూల్చివేత ఘటనతో ఎంత వేగంగా విమర్శలు మిన్నంటాయో.. అంతే వేగంగా బాధితులకు స్వాంతన కలిగించే చర్యలకు పూనుకోవడంతో కారుచీకట్లు కమ్ముకున్న వెలుగుమట్ల నిరుపేదల జీవితాలలో శాశ్వత వెలుగులు నింపినట్లయిందని చెప్పకతప్పదు.
వనం వెంకటేశ్వర్లు
98489 97240
(ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి)