Reading Time: 3 minutes

అధికారంలో ఉన్నపుడు పార్టీగా కాంగ్రెస్ బలహీనంగా కనిపిస్తుంది, అనైక్యత ప్రబలుతుంది అనే పరిశీలన ఒకటుంది. ఒకవైపు పెరిగే ప్రభుత్వ వ్యతిరేకత, మరోవైపు పార్టీ అంతర్గత వైరుధ్యాలు, బహిరంగ వ్యాఖ్యలు, అసంతృప్తులు సంస్థాగత స్థితిని దిగజార్చడం వల్లే ఎన్నికల సమయానికి అది మరింత బలహీనపడటం, అధికారం కోల్పోవడం లోగడ పలుమార్లు రుజువైంది. అలా కాకుండా, అధికారంలో ఉన్నపుడు పార్టీని ఓ కంట కనిపెడుతూ, జాగ్రత్తలు తీసుకుంటూ తిరిగి అధికారం నిలబెట్టుకున్న సందర్భాలు కాంగ్రెస్‌లో అరుదు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో 2009 ఎన్నికల్లో గెలుపు అటువంటిదే! అదైనా, వైఎస్‌ఆర్ మాటల్లోనే చెప్పాల్సి వస్తే, ‘బొటాబోటి పాస్ మార్కులతో (156/294) గట్టెక్కడం’ మాత్రమే! తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత, అంటే నాలుగున్నర దశాబ్దాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణలో కాని, అదొకటే కాంగ్రెస్ తిరిగి ప్రభుత్వం నిలబెట్టుకున్న సందర్భం. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదేళ్లు ప్రభుత్వం మాదే, నేనే ముఖ్యమంత్రిని అంటున్నారు.

అందుకు వీలుగా పార్టీని ఐక్యంగా, సమర్థంగా ఉంచే విషయంలో ఆయన ప్రాధాన్యతలేంటి? కార్యాచరణ ఎలా ఉంది? అవి ఎంతమేర చెల్లుబాటవుతున్నాయి? ఇది కోటి రూకల ప్రశ్న! ఎందుకంటే, సిఎం ఇటీవలి సిఎల్‌పి సమావేశంలో మాట్లాడుతూ ‘మీడియాతో చిట్‌చాట్‌లు వద్దు.. ప్రభుత్వం పోతే నేనొక్కడిని కాదు, మొత్తం పార్టీ వ్యవస్థ మునుగుతుంది’ అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ఇది జరిగిన 24 గంటల్లో పలువురు మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఇతర నాయకులు ఇష్టానుసారం మాట్లాడారు. ఆయన చెప్పిన ‘పార్టీ లైన్’ అనే లక్ష్మణరేఖను ఖాతలు చేసినట్టు కనబడదు. కాంగ్రెస్‌లోనే పుట్టి, ఎదిగిన వారికి ఆదరణ కరువవుతోందని, బయటినుంచి వచ్చిన వారికే ప్రభుత్వంలో, పార్టీలో అందలాలు దక్కుతున్నాయనే అసంతృప్తి లోలోపల రగులుతోంది. ప్రభుత్వ పెద్దలు, పిసిసి నాయకత్వంపైనా పార్టీ సీనియర్లు కొందరు గుర్రుగా ఉన్నారు.

అభిప్రాయ భేదం, బహిరంగ వ్యాఖ్యలు ఒకటేనా?

రాజకీయ పార్టీగా కాంగ్రెస్‌లో నాయకుల మధ్య అభిప్రాయ భేదాలుండొచ్చు. బహిరంగ వ్యాఖ్యలే పార్టీకి చేటు చేస్తాయని కార్యకర్తల శ్రేణులు భావిస్తున్నాయి. పిసిసి పీఠం, బిసి వర్సెస్ అగ్రవర్ణం వంటి వివాదమొకటి మొదలైంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికలో, నాయకత్వ మార్పిడో లేని ప్రస్తుత తరుణంలో పిసిసి నేతగా ఫలానా నాయకుడుంటే బాగుంటుందనే వ్యాఖ్య, అదీ ఒక మంత్రి చేయాల్సిన అవసరం ఏముంది? అనే ప్రశ్న సహజం! అది కూడా ‘చిట్‌చాట్’లు వద్దు అని ముఖ్యమంత్రి చెప్పిన గంటల్లోనే! పిసిసి నేతగా జగ్గారెడ్డి (తూర్పు జయప్రకాశ్‌రెడ్డి) ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్య వివాదమే రేపింది.

ఫలితంగా, పిసిసి ప్రస్తుత అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్‌కు అనుకూలంగా కొందరు నాయకులు బహిరంగ ప్రకటనలు చేసే పరిస్థితి తలెత్తింది. ఇంకోవైపు మంత్రి సోదరుడు, ఎంఎల్‌ఎ రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ తానెవరికీ భజన చేయనని, పేద ప్రజలందరికీ న్యాయం జరిగే వరకు పోరాడుతానని, తనలాంటి వాళ్లే రాజకీయాల్లో మార్పు తేగలరనే వ్యాఖ్య చేసినట్టు వార్తా కథనాలొచ్చాయి. పిసిసి అధ్యక్షుడు మహేష్‌కుమార్ పైన పార్టీలో భిన్నాభిప్రాయాలున్నాయి. కాంగ్రెస్ కార్యాలయం గాంధీభవన్‌లో ఉండి నాయకుల్ని సమన్వయపరుస్తూ, పార్టీని నడిపించాల్సింది అంతకన్నా ఇతర విషయాలకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని, ఎవరెవరి వెంటో తిరుగుతారనే విమర్శ ఉంది. మహిళా కాంగ్రెస్ రాష్ర్ట అధ్యక్షురాలి నియామకాంశం కూడా వివాదాస్పదమైంది. పలు కార్పొరేషన్ల చైర్మన్లుగా పార్టీ నాయకుల్ని నియమించి రెండేళ్లయినా, డైరెక్టర్లను వేయకుండానే వారి పదవీ కాలం ముగింపునకొచ్చింది. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, పార్టీ కోసం పనిచేసిన వారికి డైరెక్టర్లుగా అవకాశం కల్పించాల్సింది కదా? అని ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లోగడ పార్టీ సమావేశంలో అడిగినపుడు, పిసిసి నుంచి సిఫారసు జాబితా రాలేదని ముఖ్యమంత్రి పేర్కొన్న విషయాన్ని పార్టీ కార్యకర్తలు గుర్తుచేస్తున్నారు. పిసిసి నేత ‘ఆబ్సెంట్ ల్యాండ్ లార్డ్’లా వ్యవహరిస్తున్నారన్న సిఎం వ్యాఖ్య అటువంటి ఒక సందర్భంలోదే! ఇక, ‘జీవన్‌రెడ్డి చాలా సీనియర్ నాయకుడు, ఆయనను పార్టీ అధినాయకత్వం సంప్రదించి, అనునయించి ఉండాల్సింది’ అన్న సీనియర్ మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్య పార్టీలో ఆలోచనలు రేపుతోంది.

ఇప్పటికిప్పుడు పుట్టింది కాదు

జీవన్‌రెడ్డి అసంతృప్తి పార్టీలో అకస్మాత్తుగా పుట్టిన సమస్య కాదు. చాన్నాళ్లుగా రగులుతున్నదే! 2021, నాగార్జున్‌సాగర్ ఉపఎన్నికలకు ముందరే జీవన్‌రెడ్డి పేరు తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఖాయమైంది. పలువురు అభినందనలు కూడా చెప్పారు. అప్పుడు ప్రచార కమిటీ నేతృత్వానికి రేవంత్‌రెడ్డి అంగీకరించడం, ఆ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా వెల్లడించడం జరిగాయి. రేపోమాపో జీవన్‌రెడ్డి పేరు పిసిసి పీఠానికి ప్రకటిస్తారన్నపుడు, ఆ దశలో వద్దని ఉపఎన్నిక తర్వాతే ప్రకటించాలని మాజీమంత్రి జానారెడ్డి తదితరుల ఒత్తిడితో అధిష్టానం ప్రకటన ఆపింది. కానీ, తర్వాతి పరిణామాల్లో ఆయన కాకుండా రేవంత్‌రెడ్డి పిసిసి అధ్యక్షుడవడం, ఎన్నికల తర్వాత ఆయనే ముఖ్యమంత్రి కావడం అందరికీ తెలిసిందే! పట్టభద్రుల నియోజకవర్గంనుంచి ఎంఎల్‌సి అయిన జీవన్‌రెడ్డికి ఆయన కోరిన రీతిలో మరోసారి ఎంఎల్‌సి అయ్యే అవకాశాన్ని పార్టీ కల్పించలేదు. అంతకు మించి, తనపైన గెలిచివచ్చిన బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ సంజయ్ అధికారికంగా కాంగ్రెస్‌లో చేరకపోయినా పార్టీలో, ప్రభుత్వంలో అన్ని అవకాశాలు ఆయనకే కల్పించడం రాజకీయంగా తన ఉనికికి పెరుగుతున్న ప్రమాదంగా జీవన్‌రెడ్డి భావిస్తూ వచ్చారు.

దాన్ని ఆయనేం దాచుకోకుండా ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉన్నారు. పార్టీ వీడనున్నారని తెలిసి ఇదివరకే ఒకసారి ఢిల్లీ పెద్దలు మాట్లాడి, జీవన్‌రెడ్డిని అనునయించి ఉన్నారు. కానీ, ఇప్పుడాయన పార్టీ వీడతారని, నెలాఖరులో బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతారని వార్తలొచ్చాయి. భవిష్యత్ నిర్ణయించలేదు కానీ, పార్టీలో కొనసాగలేని పరిస్థితి ఉందని జీవన్‌రెడ్డియే స్వయంగా ప్రకటించారు. ఈ తరుణంలో జీవన్‌రెడ్డి వ్యవహారంపై పాత కరీంనగర్ జిల్లా నేత, సీనియర్ మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యలు, అదీ సిఎల్‌పి భేటీలో సిఎం వ్యాఖ్యల తర్వాత రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాంగ్రెస్ పార్టీలో అందరూ, అందరికీ ‘సమయం’ ఇవ్వాల్సిన సమయమొచ్చింది. తగిన సమయం ఇవ్వట్లేదని.. ఇంకా ఇతరత్రా కారణాలతో కార్యకర్తలు ఎంఎల్‌ఎలపైన, ఎంఎల్‌ఎలు మంత్రులపైన, మంత్రులు సిఎంపైన కొంత అసంతృప్తితో ఉన్నారు. ‘నేను సమయం ఇస్తాను, మంత్రులు మీరూ ఎంఎల్‌ఎలకు సమయమీయండి’ అని సిఎం రేవంత్‌రెడ్డి సిఎల్‌పి భేటీలో సూచించారు. రేపటి రెండున్నరేళ్ల కాలానికి అదే ముఖ్యం కానుంది. పార్టీ ప్రభుత్వం మధ్య ‘సమన్వయం’ కోసం కొందరు నాయకులతో ఒక కమిటీ వేశారు. సమన్వయ కమిటీలో ఉన్న వాళ్లకే వాళ్ల పరిధిలో, వారి జిల్లాల్లో ఇతర నాయకులతో సమన్వయం లేదనే విమర్శ కాంగ్రెస్‌లో వినిపిస్తోంది. పార్టీని సమన్వయపరచకుండా కడదాకా ‘ఇంకా ఆఖరి బంతి మిగిలే ఉంది’ అన్న ముఖ్యమంత్రి ఒకరు పార్టీని వీడి వెళ్లిన తర్వాత, రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఏ గతి పట్టిందో అధిష్టానం పాఠం నేర్చుకోవాలి!

సిఎం కారణంగా పార్టీలో తెలుగుదేశం నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత పెరుగుతోందనే వాదన కాంగ్రెస్‌లో బలంగా ఉంది. తెలంగాణ ప్రజానీకానికి ఎపి సిఎం చంద్రబాబు మీద ఇంకా కోపం తగ్గని పరిస్థితుల్లో తరచూ ఆయన్ని పొగడటం, పార్టీని ‘తెలుగు కాంగ్రెస్’ చేయడం ప్రమాదకరమనే వారున్నారు. మొదట్నుంచి కాంగ్రెస్‌నే నమ్ముకున్న వారిని లెక్కచేయట్లేదని, సగం కేబినెట్ బయటి నుంచి వచ్చిన వారో, బయటకు వెళ్లి వచ్చిన వారితోనో నిండిందనే వ్యాఖ్యలు పార్టీలో వినిపిస్తున్నాయి. సింగరేణి స్కాం వివాదం తర్వాత ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దగ్గర కొందరు మంత్రులు భేటీ అయ్యారనే వార్తలొచ్చాయి. అరడజన్ మందికిపైగా పార్టీ ఎంఎల్‌ఎలు ఇటీవలే ఓ డిన్నర్ పార్టీలో సమావేశమై అసంతృప్తి ‘మనోభావాలు’ పంచుకున్నారనే వార్త గుప్పుమంది. ఇది కాంగ్రెస్‌కి కీలక సమయం.

(రచయిత పొలిటికల్ అనలిస్ట్, డైరెక్టర్ ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ)

దిలీప్‌రెడ్డి

సమకాలీనం