
హైదరాబాద్: ఈ నూతన సంవత్సరం రైతు నామ సంవత్సరం అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. రవీంద్ర భారతిలో భాష, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సిఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం సిఎం మాట్లాడుతూ.. ఉగాది ప్రధానంగా రైతుల పండుగ అని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని పేర్కొన్నారు. ‘‘రైతును రాజుగా చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. రైతులు బాగున్నప్పుడే రాష్ట్రం సుఖ శాంతులతో ఉంటుంది. రాష్ట్రంలో 70 శాతం వ్యవసాయ ఆధారిత కుటుంబాలే. రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశాం. రైతులు ఆత్మగౌరవంతో బతికేందుకు ప్రభుత్వం కృషి చేసింది. రైతు భరోసా ద్వారా ఇప్పటికే రూ.18 వేల కోట్లు ఇచ్చాం. ఈ నెల 22 నుంచి మళ్లీ రైతు భరోసా కార్యక్రమం ప్రారంభమవుతుంది. రైతుల అభివృద్ధి కోసం మా ప్రభుత్వం కృషి చేస్తోంది’’ అని సిఎం అన్నారు.