
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతంలో విధించిన టారిఫ్‌ల భారంతో ప్రపంచ వాణిజ్యం ఏ విధంగా ఒడిదుడుకులకు లోనయ్యిందో ఇప్పుడు ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై సాగిస్తున్న యుద్ధం బీభత్సంగా తయారై ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా, భారత్‌పైనా ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. అసలు ఈ యుద్ధం వల్ల అమెరికాకు ఎంతవరకు లాభమని, ఇజ్రాయెల్ ఒత్తిడితో తప్పుదారి పట్టడం మంచిది కాదని అమెరికా ఉగ్రవాద నిరోధక కేంద్రం డైరెక్టర్ జో కెంట్ నేరుగా ట్రంప్‌కు లేఖ రాసి నిలదీశారు. అంతేకాదు ఇరాన్‌పై యుద్ధానికి మద్దతు ఇవ్వడానికి తన మనస్సాక్షి అంగీకరించడం లేదని తన పదవికి జో కెంట్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. యుద్ధంలో ఇరాన్ గట్టిగా ఎదుర్కొని అమెరికాను ధిక్కరించడం ట్రంప్‌లో యుద్ధోన్మాదాన్ని మరింత పెంచుతోంది. ఇందులో అమెరికాకు మద్దతుగా యుద్ధం లోకి దిగడానికి ఇతర దేశాలు తిరస్కరిస్తున్నాయి. స్పెయిన్ తన భూభాగంలో మిలిటరీ స్థావరాలను అమెరికా వినియోగించుకోవడానికి ఒప్పుకోవడం లేదు.
ఇది మానవత్వ ప్రయోజనాలకు విరుద్ధమని, అక్రమమని స్పెయిన్ స్పష్టం చేసింది. హోర్ముజ్ జలసంధిని ఇరాన్ పిడికిలినుంచి తప్పించడానికి సాయపడేలా ఐరోపా యుద్ధనౌకలను పంపించకుంటే భవిష్యత్ ఉండబోదన్న ట్రంప్ హెచ్చరికలను నాటో దేశాల కూటమి ఖాతరు చేయడం లేదు. ఈ యుద్ధాన్ని పొడిగించడానికి తాము జోక్యం చేసుకోబోమని బ్రిటన్ ఖరాఖండీగా తేల్చిచెప్పింది. అత్యంత శక్తిమంతమైన అమెరికా నేవీ దళాలే ఏమీ చేయలేకపోతున్నప్పుడు యూరప్ యుద్ధనౌకలను పంపించాలని ట్రంప్ ఎందుకు భావిస్తున్నారు? అని జర్మనీ రక్షణ మంత్రి ఎద్దేవా చేశారు. టారిఫ్‌ల విధింపుతో ప్రపంచ దేశాలు తనకు మోకరిల్లేలా ట్రంప్ మరీమరీ పీడించారు. ఒప్పందాలు కుదుర్చుకునేలా బలవంతం చేశారు. నా ఇష్టం నేనేదైనా చేస్తాను, చేయగలను అని హూంకరించారు. అయితే ఇది అంతటా, ఎల్లవేళలా సాగదు. చైనా తన అపురూప ఖనిజాల బలంతో బూచిని చూపించింది. మిగతా దేశాలు తిరస్కారం అంతగా చూపించకుండా తమ ఉనికిని కాపాడుకోవడానికి స్థితిస్థాపకతను ప్రదర్శించాయి. ట్రంప్ అస్థిరమైన, అనూహ్య నిర్ణయాలకు కొన్నిదేశాలు తమ మార్గాన్ని మార్చుకున్నాయి.
ఇప్పటికి భారత్ కూడా తనకు కావలసిన ఇంధనం అవసరాలు హోర్ముజ్ జలసంధి ద్వారా రవాణా అయ్యేలా ఇరాన్‌తో సంప్రదింపులు సాగించింది. అయినప్పటికీ ట్రంప్ తన వినాశన విధానాలను మార్చుకోవడం లేదు. ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ఇది ఒక్క ట్రంప్ విషయం లోనే కాదు, అధికార గర్వాంధకారంతో తుళ్లిపడే ఎవరికైనా చరిత్ర ఎన్నో గుణపాఠాలు నేర్పిన సంగతి తెలిసిందే. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తన నిర్ణయానికి ఎదురులేదన్న అతిశయంతో ఎమర్జెన్సీని విధించి తరువాత వచ్చే ఎన్నికల్లో భంగపడ్డారు. లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ టెస్టోస్టెరాన్ క్యాన్సర్‌ను జయించి, సైక్లింగ్ చరిత్రలో అత్యంత గొప్ప క్రీడాకారుడుగా గుర్తింపు పొందాడు. ఆ సమయంలో అతణ్ణి ఎవరూ ఓడించలేరని, అజేయుడని ప్రపంచం నమ్మింది. కానీ 2013 లో నిషేధిత ఉత్ప్రేరకాలను వినియోగించినట్టు ఒప్పుకుని సైక్లింగ్‌లో జీవితకాల నిషేధానికి గురయ్యాడు. ఒకప్పుడు హాలీవుడ్ రాజుగా వెలుగొందిన హార్వేవెయిన్‌స్టెయిన్ ప్రముఖ నిర్మాత మాత్రమే కాదు, ఆస్కార్ అవార్డులు ఎన్నో గెల్చుకున్న మిరామాక్స్ స్టుడియో నిర్మాత. అయితే 2017 లో అతని లైంగిక వేధింపుల నేరాలు పతనానికి దారితీశాయి. 202223 లో వేర్వేరు అత్యాచార కేసుల్లో ఆయనకు న్యూయార్క్ కోర్టు 23ఏళ్ల జైలుశిక్ష విధించింది. అధికారం చేతిలో ఉన్నప్పుడు పరిస్థితి ఎప్పుడూ ఇలాగే ఉంటుందని గర్వంతో, అహంకారంతో విర్రవీగుతుంటారు.
అదే విధంగా వ్యవహరిస్తున్న ట్రంప్‌కు 2026లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ విధించిన విస్తృతమైన గ్లోబల్ టారిఫ్‌లు చట్ట విరుద్ధమని అమెరికా సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులనే ట్రంప్ అపహాస్యం చేశారు. మూర్ఖులని, లాప్‌డాగ్స్ అని తీవ్రంగా వ్యాఖ్యానించారంటే ఆయన ఎంత దురహంకారంతో ఉన్నారో తెలుస్తుంది. ఇప్పటికీ ట్రంప్‌లో పశ్చాత్తాపం కనిపించడం లేదు. ఇరాన్‌ను పూర్తిగా ధ్వంసం చేసిన తరువాత క్యూబా సంగతి తేలుస్తానని హెచ్చరిస్తున్నారు. ప్రాచీన గ్రీకు సామెత గుర్తు తెచ్చుకుంటే నిర్లక్షం కన్నా దురహంకారం చాలా ప్రమాదం అని ఏనాడో చెప్పారు. ఇది కేవలం వ్యక్తిత్వ లోపం మాత్రమే కాదు. విశ్వ, సామాజిక క్రమాన్ని ఉల్లంఘించడం అవుతుంది. అధికారం గర్వం ప్రతీకారం అనే ధోరణిలోనే ఇలాంటి కథలు సాగుతుంటాయి.
1945 1952 ప్రాంతంలో రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జపాన్, జర్మనీ దేశాల్లో ప్రజాస్వామ్యాన్ని స్థాపించడంలో అమెరికా కీలక పాత్ర వహించిందని చరిత్ర చెబుతోంది. 1947లో అమెరికా సాయంతో జపాన్ కొత్త ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని ఆమోదించింది. చక్రవర్తి అధికారాలను తగ్గించి ప్రజలకు ప్రాథమిక హక్కులను కల్పించింది. అలాగే జర్మనీలో నాజీయిజం నిర్మూలించి సోవియెట్ యూనియన్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి స్థిరమైన, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని సృష్టించడం అమెరికా ప్రధాన వ్యూహంలో భాగమైంది. యుద్ధానంతరం ప్రపంచంలో శక్తివంతమైన మిత్రదేశాలుగా జపాన్, జర్మనీలను తీర్చిదిద్దడంలో అమెరికా పాత్ర కీలకమైందని చరిత్ర చెబుతోంది. కానీ ఇప్పుడు 21వ శతాబ్దంలో అమెరికా నేతృత్వం లోని కూటమి జరిపిన ‘ప్రభుత్వాలను పడగొట్టే యుద్ధాలు’ ముఖ్యంగా ఇరాక్, లిబియా, అఫ్గానిస్థాన్ ప్రభుత్వాల మార్పు ప్రపంచ రాజకీయాలను, భౌగోళిక పరిస్థితులను పూర్తిగా మార్చి వేశాయి. ఉగ్రవాదాన్ని అంతమొందించడానికే ఈ యుద్ధాలని పైకి చెబుతున్నా ఫలితాలు మాత్ర వినాశకరంగా మారడం ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది.