
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని కరాచీలో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు కురవడంతో పాటు ఈదురుగాలులతో 20 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పాకిస్థాన్ మీడియా తెలిపింది. టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ కింద కూర్చుని టీ తాగుతున్న వారిపై పైకప్పు, గోడ కూలిపోవడంతో 12 మంది మరణించారు. సయీదాబాద్ ప్రాంతంలోని మావచ్ గోత్ తో బలమైన గాలులు, ఉరుములు, వర్షాల కారణంగా రెండంతస్తుల భవనం కూలిపోవడంతో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని శిథిలాలను తొలగిస్తున్నాయని, శిథిలాల కింద మరికొంతమంది ఉన్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కరాచీలో గంటలకు 80 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. విద్యుత్ తీగలు తెగిపడడంతో కరాచీలోని 60 శాతం ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరాచీ మేయర్ నగరంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. పాక్ లోని జంషోరో, హైదరాబాద్, తట్టా, సుజావల్, బాడిన్, మతియారీ, తండో ముహమ్మద్ ఖాన్, తండో అల్లా యార్, ఉమర్‌కోట్, థార్‌పార్కర్, సంఘర్, మీర్‌పుర్‌ఖాస్, నౌషాహ్రో ఫిరోజ్, షహీద్ బెనజీరాబాద్, దాదు ప్రాంతాలలో బలమైన గాలులు వీయడంతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.