
అమరావతి: ఆంధ్రప్రదేశ్ యువతకు కూటమి ప్రభుత్వం ఉగాది పండుగ రోజున జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయనుంది. యువగళం పాదయత్రలో మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చిన ప్రకారం ఉగాదిని పురస్కరించుకున్న సందర్భంగా గురువారం జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నారు. కూటమి ప్రభుత్వం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది. ఇప్పటికే మెగా డీఎస్సీ ద్వారా 16వేల ఉపాధ్యాయుల పోస్టులు, 6 వేల కానిస్టేబుల్ పోస్టులు, వివిధ ప్రభుత్వ శాఖల్లో 9 వేల పోస్టులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండగ ప్రకటిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నేను ఇచ్చిన హామీని ప్రజా ప్రభుత్వం నెరవేర్చడం చాలా సంతోషంగా ఉందని తన సోషల్ మీడియా ఖాతాలో లోకేష్ పోస్టు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఏ తేదీన వస్తాయో, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామో ప్రకటిస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించారు. అలాగే నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తామని, సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తామన్నారు. ఉద్యోగార్థులందరూ నైపుణ్యం పోర్టల్ నందు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోని అలర్ట్స్ పొందాలని సూచించారు. ఇక ప్రతీ ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్రకటన పండగ ఉంటుందని, తన మాట నేను నిలబెట్టుకున్నానని, ప్రజా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని, ఇక నిరుద్యోగులు పోటీపరీక్షలకు సిద్ధం కావాలని, తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.