Reading Time: < 1 minute

మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో సిట్ ఏర్పాటు చేశాం

ఏలూరు ఎంపి బెయిల్ విషయంలో మా ప్రమేయం లేదు

రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ లక్షం

డ్రగ్స్ విషయంలో ఎంతటి వారైనా సరే, ఉక్కుపాదంతో అణిచివేస్తాం

ఢిల్లీలో విలేకరులతో సిఎం రేవంత్‌రెడ్డి చిట్‌చాట్ 

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సిఎం భేటీ

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే 2028లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదని, జాతీయ స్థాయి పరిణామాలు, నియోజకవర్గాల పునర్విభజన లాంటి అంశాల నేపథ్యంలో 2029లోనే జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఫాంహౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ వ్యవహారంపై మాట్లాడుతూ ఈ కేసు తీవ్రత దృష్ట్యా ఇప్పటికే 9 మంది అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కేసులో ఏలూరు ఎంపి (పుట్టా మహేష్ కుమార్) పట్టుబడ్డారని, ఆయన స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చారని, ఆయన బెయిల్ విషయంలో ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన స్పష్టం చేశారు. డ్రగ్స్ విషయంలో ఎంతటి వారైనా సరే, ఉక్కుపాదంతో అణిచివేస్తామన్నారు. డ్రగ్స్ రవాణా, వినియోగం విషయంలో ఎంతటి వ్యక్తులనైనా వదిలిపెట్టబోమని సిఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు ముందే వస్తే తనకు సంతోషమేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

రెండోరోజూ బిజీబిజీ

ఢిల్లీ టూర్‌లో భాగంగా రెండోరోజూ సిఎం రేవంత్‌రెడ్డి బిజీబిజీ గడిపారు. అంతకముందు పార్లమెంట్‌లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభకు ఇటీవల ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని వారికి పరిచయం చేశారు.

ఆప్యాయంగా పలకరించుకున్న సిఎం రేవంత్‌, మాజీ మంత్రి రోజా

పార్లమెంట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో సిఎం రేవంత్‌రెడ్డి వైసిపి నేత, మాజీ మంత్రి రోజా ఎదురుపడ్డారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాజీ మంత్రి రోజా షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు.