Reading Time: 2 minutes

రూ.33,600 కోట్లతో కొత్త పథకానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ 

చిన్నతరహా జల విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.2,585 కోట్లు

ఉత్తరప్రదేశ్‌కు మరో జాతీయ రహదారి

న్యూఢిల్లీ ః కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన(భవ్య) పథకాన్ని ఆవిష్కరించింది. రూ 33,600 కోట్ల ఈ పథకానికి కేంద్ర మంత్రి మండలి బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. సమావేశ వివరాలను కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అశ్విని వైష్ణవ్ ఆ తరువాత విలేకరులకు తెలిపారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో పారిశ్రామిక వాడలను చేపట్టి, ప్రారంభించేందుకు ఈ పథకం తీసుకువచ్చారు. ప్రత్యేకించి పారిశ్రామిక ప్రపంచ స్థాయి మౌలిక సాధనాసంపత్తి నెలకొల్పేందుకు , ఉత్పత్తి సామర్థం పెంచేందుకు , దేశ ప్రగతి పథం సక్రమ గతికి ఈ పథకం రూపొందించారని మంత్రి తెలిపారు. భవ్య స్కీంతో దేశవ్యాప్తంగా దాదాపుగా 15 లక్షల వరకూ ప్రత్యక్ష ఉద్యోగాలు వస్తాయి. పరోక్షంగా కూడా ఉపాధికి అవకాశం ఉంది. వంద ఎకరాల నుంచి వేయి ఎకరాల విస్తీర్ణంలో ఇండస్ట్రీయల్ పార్క్‌ల ఏర్పాటుతో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుంది. ఒక్కో పార్క్‌కు వాటి స్థాయి బట్టి రూ కోటి వరకూ ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుందని స్కీం గురించి మంత్రి తెలిపారు.

రూ 2585 కోట్లతో చిన్న జలవిద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధి

దేశంలో జలవిద్యుత్ ఉత్పాదన సంబంధిత చిన్న తరహా హైడ్రో పవర్ డెవలప్‌మెంట్ స్కీంను రూ 2585 కోట్లతో కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది. కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ స్కీం ద్వారా 1500 మైక్రోవాట్స్ మేర పునరుత్థాన ఇంధన ఉత్పత్తి లక్షం ఖరారు చేసుకున్నారు. దేశ పర్యావరణ పరిరక్షణ దిశలో ఈ స్కీంకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రజలు నిర్వాసితులు కాకుండా చేస్తూ, డ్యామ్‌ల నిర్మాణం లేకుండానే నదులపై ఈ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తారని మంత్రి వైష్ణవ్ తెలిపారు. ఒక్కో జలవిద్యుత్ ప్రాజెక్టు ద్వారా 1 మైక్రోవాట్ నుంచి 25 మైక్రోవాట్స్ మేర విద్యుత్ ఉత్పాదక సామర్థం ఉంటుంది. ఈ పధకాన్ని ఐదేళ్ల పాటు 203031 ఆర్థిక సంవత్సరం వరకూ అమలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం పత్తి సేకరణ సామర్థం పెంపుదలకు చర్యలు తీసుకునే నిర్ణయానికి ఆమోదం తెలిపింది. దీని మేరకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ)కు రూ 1,718 కోట్లు కేటాయింపుల నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

యుపికి నాలుగులేన్ల రహదారి..హైవే 927

ఉత్తరప్రదేశ్‌కు ఉపయుక్తంగా ఉండేలా రూ 6969 కోట్ల వ్యయంతో నాలుగు లేన్ల జాతీయ రహదారినెంబరు 927 నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రహదారి ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి నుంచి బహరైచ్ వరకూ నిర్మిస్తారు. 101 కిలోమీటర్లకు పైగా ఉండే ఈ రోడ్ నిర్మాణంతో ఈ ప్రాంతంలో ఆర్థిక, సామాజిక, అత్యంత కీలక సంస్థల కేంద్రీకృత ప్రాంతాలకు మరింత రవాణా అనుసంధానత ఏర్పడుతుంది.