Reading Time: 3 minutes

ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి హతం

బషెర్ అణు కేంద్రంపై దాడులు

గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులు

ఇజ్రాయెల్ దాడుల్లో ఖతార్ చమురు క్షేత్రం ధ్వంసం

కువైట్ యువరాజుతో ప్రధాని మోడీ చర్చలు

హర్మూజ్ జలసంధి భద్రతకే ప్రాధాన్యమని స్పష్టీకరణ

జెరూసలెం: ఇజ్రాయెల్ సైనిక దాడులలో బుధవారం ఇరాన్ ఇంటలిజెన్స్ వ్యవహారాల మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ మృతి చెందారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ తెలిపారు. టెహరాన్ వద్ద ఇజ్రాయెల్ తెల్లవారుజామున భీకర దాడులకు దిగింది. ఈ క్రమంలో ఇంటలిజెన్స్ మంత్రి హతులయాయరని వివరించారు. ఇది ఇరాన్‌కు అత్యున్నత స్థాయి నష్టం అని విశ్లేషించారు. తమ దాడులు మరింత విస్తృతం అవుతా యి. శత్రుపక్షాలు విస్తుపోయ్యేలా దెబ్బతీస్తామని ఇజ్రాయెల్ మంత్రి తెలిపారు. ఇరాన్ అత్యున్నత స్థాయి భద్రతా సంబంధిత వ్యక్తులు హతులు కా వడం వరుసగా రెండురోజుల్లో ఇది రెండో ఘటన అయింది. అయితే ఖ తీబ్ మృతిని ఇరాన్ అధికారికంగా నిర్థారించలేదు.

ఇరాన్ బలగాలు బుధవారం పర్షియన్ గల్ప్, ఇజ్రాయెల్‌పై దాడులను ఉధృతం చేశాయి. వరుసగా మూడోరోజు కూడా ఇరాన్ విరుచుకుపడింది. టెల్ అవీవ్ వద్ద జరిపిన దాడిలో ఇద్దరు మృతి చెందారు. ఇరాన్ అత్యంత అధునాతన మిస్సైల్స్‌ను ఈ క్రమంలో ప్రయోగించింది. ఇవి అన్ని కూడా ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడులను తట్టుకుంటూ, తప్పించుకుంటూ ముందుకు సాగాయి. పరస్పర దాడుల తీవ్రతతో ఇప్పటి పోరు ఎప్పటిలోగా ఆగిపోతుందో తెలియని స్థితి నెలకొంది, మరో వైపు ఇజ్రాయెల్ లెబనాన్‌లో తమ దాడులను ముమ్మరం చేశాయి. ఇరాన్ మద్దతుగల హెజ్‌బోల్లా మిలిటెంట్లను గురిచేసుకున్నాయి. బీరూట్ ఇతర ప్రాంతాలో బహుళ అంతస్తుల భవనాలు ధ్వంసం అయ్యాయి.

ఇరాన్‌లో బషేర్ అను విద్యుత్ కేంద్రం ఆవరణపై ఓ క్షిపణి దాడి జరిగింది. ఈ క్రమంలో ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం అణు ధ్వంసం జరగలేదని వెల్లడైంది. అణు ప్రమాదాలు జరగకుండా వ్యవహరించాలని ఇరుపక్షాలకు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఎఇఎ) చీఫ్ రాఫెల్ గ్రాసీ విజ్ఞప్తి చేశారు, ఇరాన్ నుంచి అందిన సమాచారంతో ఆయన స్పందించారు. ఇరాన్‌లో ఇజ్రాయెల్ తరఫున వేగు చర్యలకు పాల్పడుతున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తికి మరణశిక్ష అమలు చేశారు. ఇజ్రాయెల్ మోసాద్ సంస్థకు ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాడని పేర్కొంటూ కైరోష్ కెవ్యానిని చంపివేశారు. ఇరాన్‌కు చెందిన కీలక ప్రాంతాలను మోసాద్ గూఢచార సంస్థకు అందించాడనే విషయాన్ని నిర్థారించుకుని శిక్ష అమలు చేశారు.

కోర్టు కాంప్లెక్స్‌పై దాడులు.. పౌరులు సిబ్బంది మృతి

బుధవారం మధ్యాహ్నం ఇరాన్‌లోని లారెస్తన్‌లో ఓ కోర్టు కాంప్లెక్స్‌పై ఇజ్రాయెల్, అమెరికా సేనలు దాడులకు దిగాయి. కార్యాలయం పనిచేస్తున్న సమయంలో దాడులు జరిగాయి. ఈ దాడులలో పౌరులు, సిబ్బంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారని తెలిపారు. అమెరికా సైనిక స్థావరాలతో ఉన్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణుల దాడులు నిర్ణీత ప్రాంతాల్లో జరుగుతున్నాయి. సౌదీలోని విస్తారిత తూర్పు ప్రాంతంపై ఇరాన్ దాడి జరిపింది. అక్కడి చమురు క్షేత్రాలపై , కువైట్, బహరైన్ లోని సైనిక కేంద్రాలపై కూడా దాడులు జరిగాయి. సౌదీ అరేబియా పలు బాలిస్టిక్ క్షిపణులను నేల కూల్చింది. ప్రత్యేకించి ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్ వైపు దూసుకువచ్చిన క్షిపణులను దెబ్బతీశారు. ఇక్కడ అమెరికా సైనిక బలగాలు, ఓ యుద్ధ విమానం ఉంటుంది. రియాద్‌లో ఓ దౌత్య సిబ్బంది క్వార్టర్స్‌పై దాడి జరిగింది. ఇక్కడ అమెరికా ఎంబసీ వారు, ఇతర విదేశీ దౌత్య సిబ్బంది నివాసం ఉంటున్నారు.

లారిజనీ హత్యకు ప్రతీకారం

మరో వైపు బుధవారం ఇరాన్ ఇజ్రాయెల్‌పై పలు ప్రతీకార దాడులకు దిగింది. తమ దేశ అత్యంత శక్తివంతమైన జాతీయ భద్రతా మడలి కార్యదర్శి లారిజనిని ఇజ్రాయెల్ దాడులలో చంపివేయడంపై భగ్గుమంటూ దాడులు జరిగాయి. సెంట్రల్ ఇజ్రాయెల్‌పై తాము పలు వార్‌హెడ్స్‌తో దాడికి దిగినట్లు ఇరాన్ సైన్యం తెలిపింది. ఇప్పుడు ఇజ్రాయెల్ దాడులలో మృతి చెందిన లారిజనీ, ఖతీబ్‌లపై అమెరికా ఇప్పటికే అమెరికా నుంచి నిషేధిత వ్యక్తుల కఠిన చర్యలు ప్రకటించింది. బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ మరోసారి దాడులకు దిగింది. ఇరాన్ రెడ్ క్రెసెంట్ వివరాల ప్రకారం ఇప్పటివరకూ జరిగిన దాడులలో 1300 మందికి పైగా ఇరానీయన్లు మృతి చెందారు. వేలాది మంది గాయపడ్డారు. నిర్వాసితులు అయ్యారు.

ఇజ్రాయెల్ సైనిక దాడులు.. ఇరాన్, ఖతార్ చమురు క్షేత్రంలో మంటలు

దుబాయ్: ఇరాన్, ఖతార్‌లు సంయుక్తంగా నిర్వహిస్తున్న సముద్ర తీర సహజవాయువు ఉత్పత్తి కేంద్రం సౌత్ పార్స్ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్ బుధవారం దాడులకు దిగింది. ఈ ఘటనపై ఖతార్ తీవ్రంగా మండిపడింది. ఇజ్రాయెల్ చర్యను ఖండిస్తున్నామని ఖతార్ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మజీద్ అల్ అన్సారీ ప్రకటన వెలువరించారు. ఈ ఫీల్డ్‌కు చెందిన ఇరాన్ వైపు ఉన్న భాగం దగ్ధం అయిందని తెలిపారు. ప్రస్తుత విస్తారిత ఉద్రిక్తతల దశలో ఇటువంటి దాడుల ఘటన అత్యంత ప్రమాదకరం అని అల్ అన్సారీ విమర్శించారు.

ప్రపంచ ఇంధన వ్యవస్థకు ఇది పెను ముప్పు కల్గిస్తుంది. బాధ్యతారహిత ఘటన అని తెలిపారు. ఇరాన్ జరిపిన దాడులలో దుబాయ్ వద్ద ఉన్న తమ స్థావరంలో కొద్దిగా మంటలు చెలరేగాయని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనెస్ వెల్లడించారు. అయితే ఎటువంటి నష్టం జరగలేదన్నారు. పశ్చిమ దేశాలకు మార్గమధ్యపు మజిలీ అయిన అల్ మిన్హాద్ ఎయిర్ బేస్ వద్ద పేలుళ్లు జరిగాయి. సౌదీ అరేబియాకు చెందిన సమ్రేఫ్ రిఫైనరీ, జుబాలీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన అల్ హసన్ గ్యాస్ ఫీల్డ్ , ఖతార్‌లోని రిఫైనరీ, పెట్రో కెమికల్ విభాగాలను దెబ్బతీస్తామని ఇరాన్ హెచ్చరించింది.

కువైట్ యువరాజుతో ప్రధాని మోడీ చర్చలు

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ బీభత్సం కొనసాగుతున్న నేపథ్యంలో కువైట్ యువరాజు షేక్ అల్ ఖలేద్ తో టెలిఫోన్ ద్వారా ప్రధాని నరేంద్రమోడీ సంభాషించారు. పశ్చిమాసియాలో యుద్ధం మూడు వారాల క్రితం ప్రారంభమైన తరువాత కువైట్ యువరాజుతో మోడీ మాట్లాడడం ఇది రెండోసారి. ఈ సందర్భంగా కువైట్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతపై జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తోందని ప్రధాని పునరుద్ఘాటించారు. ముఖ్యంగా ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్మూజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు సురక్షితంగా,స్వేచ్ఛగా సాగడమే తమ ప్రథమ ప్రాధాన్యతగా మోడీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇటీవల ఎదురవుతున్న సవాళ్లపై ఇరువురు నేతలు తమ ఆందోళన పంచుకున్నారు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం దౌత్యపరమైన చర్చలు, నిరంతరం కొనసాగడం అత్యంత అవసరమని ఇరువురు ఏకీభవించారు.

ఇదే క్రమంలో కువైట్‌లో నివసిస్తున్న భారతీయ సమాజం భద్రత, సంక్షేమం కోసం కువైట్ ప్రభుత్వం అందిస్తున్న నిరంతర మద్దతుకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఈద్ పండగను పురస్కరించుకుని కువైట్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ , రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం సాగుతున్న యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాకు చెందిన సౌదీ అరేబియా, బహ్రయిన్, యుఏఇ, ఒమన్, జోర్డాన్, ఇజ్రాయెల్, ఇరాన్ తదితర అనేక దేశాల నాయకులతో ప్రధాని మోడీ చర్చలు జరిపారు.