
వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలు
భారీ వర్షానికి 150 మేకల మృత్యువాత
దెబ్బతిన్న కూరగాయలు, మొక్కజొన్న, వరి
ఈదురుగాలులకు నేలరాలిన మామిడి
హైదరాబాద్‌లోనూ వర్షం
22 వరకు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిక
రాష్ట్రంలో మంగళవారం రాత్రి నుంచి కురిసిన అకాల వర్షాలు అపార నష్టాన్ని కలిగించాయి. వడగండ్ల వానలు అన్నదాతకు కడగండ్లనే మిగిల్చాయి. వర్షాలకు ఈదురుగాలులు తోడవడంతో అనేక చోట్ల మొక్కజొన్న నేలకొరిగింది. మామిడి నేలరాలింది. కూరగాయల సాగు దెబ్బతినింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి మూగజీవాలు బలయ్యాయి. వికారాబాద్ జిల్లా పుడూరు మండలంలో 150 మేకలు చనిపోయాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వికారాబాద్, వనపర్తి, గద్వాల తదితర జిల్లాల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయి.
మన తెలంగాణ / న్యూస్ నెట్‌వర్క్ : అకాల వర్షంతో రైతులకు అపారనష్టం కలిగింది. ఆరుగాలం కష్టపడి పండించిన వివిధ రకాల పంట చేతికొచ్చే దశలోనే ప్రకృతి కన్నెర్ర చేసింది. వడగండ్లు, ఈదురు గాలులు, ఉరుములతో కురిసిన వర్షం రైతులకు శాపంగా మారింది. హైదరాబాద్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వికారాబాద్, వనపర్తి, గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కురిసిన అకాల వర్షానికి రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షానికి పెద్ద ఎత్తున పంటనష్టం వాటిల్లింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి, మంగపేటల్లో తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న పంట నేలరాలింది. వీణవకంలోన అపర పంట నష్టం జరిగింది. నర్సింగాపూర్‌లో మొక్కజొన్న పంట పూర్తిగా దెబ్బతింది. కొన్ని చోట్ల మామిడి పిందెలు రాలిపోవడంతో రైతులు ఆవేన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో వడగండ్ల వానకు చేతికి వచ్చిన పంట నేల రాలింది.
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో అకాల వర్షానికి మిర్చి రైతులు విలవిలలాడారు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం వేముల గ్రామంలో మంగళవారం రాత్రి సమయంలో పిడుగు పడి ఆవు మృతి చెందింది. అకాల వర్షానికి, ఈదురు గాలులకు మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టమైంది. వడగండ్ల వానకు సదాశివపేట మండల పరిథిలోని నాగులపల్లిలోని ప్రాథమిక పాఠశాల గోడ కూలింది. ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మార్కెట్ యార్డులో రైతుల కంది పంట తడిసి ముద్దయింది.
150 మేకలు మృత్యువాత
వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని నిజాంపేట్‌మేడిపల్లి గ్రామ శివార్‌లో నియోజకవర్గంలోని చౌడాపూర్ మండలం కొత్తపల్లిలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులకు మేకలు మృతి చెందాయి. పరిగి మండల పరిధిలోని ఆయా గ్రామాలలో తీవ్రంగా పలు రకాల పంటలు, కూరగాయలు నేలమట్టమై నష్టం వాటిల్లింది. పాల్కంపల్లి, నర్సయ్యగూడ, రాపోల్, తదితర గ్రామాల్లో వేసిన పంట పూర్తిగా దెబ్బతింది. నర్సయ్యగూడలో పిడుగు పడి గ్రామంలో ప్యాట శ్రీనివాస్‌కు చెందిన రూ. 60 వేల విలువ చేసే ఆవు మృతి చెందింది. షాద్ నగర్ నియోజకవర్గంలో మామిడి తోట, వరి, మొక్కజొన్న, టమాట మిరపకాయ వంటి పంటలు దెబ్బతిన్నాయి.