Reading Time: 2 minutes

కాకరేపుతున్న కోమటిరెడ్డి వ్యాఖ్యలు

ఎమ్మెల్యేగా గెలవని జగ్గారెడ్డి వంద సీట్లు గెలిపిస్తాడా?

మొన్న నల్లగొండ డీసీసీ అధ్యక్షుడిపై విమర్శలు

తాజాగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు

పార్టీలో బీసీ నేతల పట్ల అక్కసు ఎందుకని మండిపాటు

కాంగ్రెస్ వర్గాలలో అసెంబ్లీ లాబీలలో దీనిపైనే చర్చ

పార్టీ పెద్దలు కూడా సీరియస్‌గా తీసుకున్నట్టు సమాచారం

మన తెలంగాణ/ హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీలో తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొత్త చిచ్చుకు, చర్చకు దారితీసాయి. పీసీసీ అధ్యక్షునిగా మహేష్‌కుమార్‌గౌడ్ స్థానంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని నియమిస్తే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వంద సీట్లు గెలుచుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ పార్టీలో రెడ్డి వర్సెస్ బీసీగా సమీకరణలు ఉపందుకున్నాయి. ఇటు పార్టీ వర్గాలలో, అటు అసెంబ్లీ లాబీలలోనూ బుధవారం ఈ అంశంపైనే చర్చ జరిగింది.

కాంగ్రెస్ పార్టీ ఒకవైపు బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్లడమే కాకుండా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలలో పార్టీపరంగా 56 శాతం అవకాశం కల్పించిన నేపథ్యంలో రాష్ట్ర పార్టీకి సారధ్యం వహిస్తోన్న బీసీ నాయకుడు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ నాయకత్వాన్ని తక్కువ చేసే విధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేయడం పట్ల పార్టీలో బీసీల మనోవభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆ సామాజివర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు మండిపడుతున్నారు. ఇటీవల నల్లగొండ జిల్లా డీసీసీ అధ్యక్షునిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన పున్నా కైలాష్ నియమాకాన్ని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా ఒక కార్యక్రమంలో బహిరంగ సభలో అవమానించిన ఉదంతాన్ని తాజా వ్యాఖ్యల నేపథ్యంలో గుర్తు చేస్తున్నారు.

సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా గెలువలేని జగ్గారెడ్డి, రాష్ట్రంలో వందసీట్లు ఎలా గెలిపిస్తారని బీసీ నాయకులు మంత్రి వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ తొలి పీసీసీ అధ్యక్షునిగా నియామకం అయిన బీసీ నేత, పొన్నాల లక్ష్మయ్యను నల్లగొండ జిల్లా ప్రచారానికి రావద్దని అప్పట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో పాటు ఆ జిల్లాకు చెందిన రెడ్డి నాయకులు సహాయ నిరాకరణ చేశారని పార్టీలో బీసీ నేతలు గుర్తు చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షునిగా మహేశ్‌కుమార్‌గౌడ్ ,సీఎం రేవంత్‌రెడ్డి వీరిద్దరూ సమన్వయం తో పని చేస్తూ ప్రతి ఎన్నికలలోనూ వరుస విజయాలు సాదించినప్పటికీ, కొత్త పీసీసీ అధ్యక్షునిగా జగ్గారెడ్డిని నియమించాలని బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజలలోకి, ముఖ్యంగా బీసీ సామాజికవర్గలోకి తప్పుడు సంకేతాలు వెళ్లే విధంగా ఉన్నాయని పార్టీ అధిష్టానం కూడా సీరియస్‌గా తీసుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.

మంత్రి కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసిన రోజు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో అధిష్టాన పెద్దలతో సమావేశం కావడంతో ఈ వ్యాఖ్యల విషయంపై కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది. గతంలో పీసీసీ అధ్యక్షునిగా రేవంత్‌రెడ్డి నియామకం అయినప్పుడు కూడా పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా కోమటిరెడ్డి ఇదే మాదిరిగా తీవ్ర ఆరోపణలు చేసిన విషయాన్ని పార్టీ పెద్దలవద్ద ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. తన శాఖకు సంబంధించి జీవోలు తనకు తెలియకుండానే వస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. మంత్రి క్రమశిక్షణారిహిత్యాన్ని అధిష్టాన పెద్దలు కూడా సీరియస్‌గా తీసుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.