
హిల్ట్, టిడిఆర్‌పై ఏ విచారణకైనా సిద్ధం
ఏ విచారణ కావాలో ప్రతిపక్ష నాయకులు లేఖ ఇవ్వాలి
విచారణకు వెనకాడినా, వెనక్కి తగ్గినా క్షమాపణ చెబుతాం
విపక్ష నేత సమయం, సందర్భం లేకుండా నచ్చినట్లు మాట్లాడుతున్నారు
ఎంతో కష్టపడి కెసిఆర్‌ను మహబూబ్ నగర్ ఎంపిగా గెలిపించాం
ఆరు గ్యారంటీల్లో ఒక్కటి మినహా అన్నీ అమలు చేస్తున్నాం
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో సిఎం రేవంత్‌రెడ్డి
ధన్యవాదాల తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం.. వాయిదా
మనతెలంగాణ/హైదరాబాద్: నన్ను తొక్కాలనుకున్న వారిని తొక్కుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చానని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అలాగే, 2029లో కూడా మళ్లీ బరాబర్ తొక్కుకుంటూ మళ్లీ అధికారంలోకి వస్తామని, 2034 వరకు తామే అధికారంలోకి ఉంటామని సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తాను వారసత్వంగా పదవిలోకి వచ్చిన వ్యక్తిని కాదన్నారు. మీ మాదిరిగా ఎవరి దయాదాక్ష ణ్యాలతో ఈ స్థాయికి రాలేదన్నారు. కనీసం వార్డుమెంబర్‌గా కూడా గెలవని వ్యక్తిని వైఎస్‌ఆర్ దయవల్ల ఏకంగా మత్రి అయ్యారని హరీష్‌రావును దెప్పిపొడుస్తూ, సిరిసిల్లలో కెటిఆర్ చంద్రబాబు దయతో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారని సిఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నేను ఎంతో కష్టపడి కెసిఆర్‌ను మహబూబ్‌నగర్ ఎంపిగా గెలిపించానని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. బిఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు ఇప్పటికే ఎన్నోసార్లు బుద్ధిచెప్పారని సిఎం అన్నారు. ప్రజలు తమ తీర్పుతో ఎన్నిసార్లు బుద్దిచెప్పినా బిఆర్‌ఎస్ నేతల తీరు మారడం లేదన్నారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు పరివారం, పలహారం అన్నట్టుగా సాగిందని సిఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం రాత్రి సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ పైన ముఖ్యంగా కెసిఆర్, కెటిఆర్, హరీష్‌రావుల వైఖరిలను ఎండగడుతూ సిఎం రేవంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు.
జీతభత్యాలపై సభలో చర్చ జరగాలి
జీతభత్యాలపై సభలో చర్చ జరగాలని సిఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉంటూ ఇప్పటివరకు కెసిఆర్ డిసెంబర్ 1, 2023 నుంచి 1 కోటి 6 లక్షల 56 వేల 674 రూపాయలు జీతభత్యాలు పొందారని, విధులకు హాజరు కాకుండా జీతభత్యాలు తీసుకోవడంపై ఒక నిర్ణయం తీసుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కెసిఆర్ ఇప్పటికైనా అసెంబ్లీకి రావాలని, విధులకు హాజరుకాకుండా ప్రజాధనాన్ని జీతభత్యాల రూపంలో తీసుకునే వారిపై సభలో చర్చ జరగాలని ఆయన అన్నారు. దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
హిల్ట్ పాలసీపై సిబిఐ, ఈడీ వంటి దర్యాప్తులతో విచారణకు సిద్ధం
హిల్ట్, టిడిఆర్‌లపై ఏ విచారణకైనా సిద్ధమని అసెంబ్లీలో సిఎం రేవంత్‌రెడ్డి బిఆర్‌ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. పారిశ్రామిక బదలాయింపులపై 2014 నుంచి ఇప్పటివరకు హిల్ట్ పాలసీపై విచారణకు సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీనిపై ఏ విచారణ కావాలో ప్రతిపక్ష నాయకులు లేఖ ఇవ్వాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. హిల్ట్ పాలసీపై సిబిఐ, ఈడీ వంటి దర్యాప్తులతో విచారణ చేయించడానికి సిద్ధమని, కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్‌ఆర్ అవతలకు పంపించేందుకే హిల్ట్ పాలసీ తెచ్చామని సిఎం తెలిపారు. దీంతోపాటు టిడిఆర్ పాలసీపై కూడా విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విచారణకు వెనకాడితే, వెనక్కి తగ్గితే క్షమాపణ చెబుతామన్నారు. గవర్నర్ ప్రసంగం ద్వారా తెలంగాణ ‘పాలసీ డాక్యుమెంట్’ను ఆవిష్కరించామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ రాష్ట్ర అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అసెంబ్లీలో చేసిన ప్రసంగం చారిత్రాత్మకమని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజులు పోయినా, రాజ్యాలు పోయినా రాచరిక పోకడలు పోలేదని బిఆర్‌ఎస్ పార్టీ తీరుపై సిఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
ప్రధాన ప్రతిపక్షం కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతుందనుకున్నానని, కానీ, వారు నియంత పోకడలతో బిఆర్‌ఎస్ నాయకులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. విపక్షనేత సమయం, సందర్భం లేకుండా నచ్చినట్లు మాట్లాడుతున్నారని సిఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నాయకులని ఆయన తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు అదే అహంకార ధోరణి, అధికారం పీకేసినా అదే అహంకారంతో వ్యవహారిస్తున్నారని సిఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.
ప్రధాన ప్రతిపక్షం నియంతృత్వ ధోరణితో
అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వస్తారనుకున్నామని, కొత్త గవర్నర్‌ను కలవడానికి ప్రతిపక్ష నేత కెసిఆర్ వస్తారనుకున్నామని, ఆయన రాకపోగా సభ సంప్రదాయాలను గౌరవించకపోడం తెలంగాణ సంస్కృతికి పూర్తి విరుద్ధమని సిఎం రేవంత్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. విపక్షాల తీరు 4 కోట్ల తెలంగాణ ప్రజలను నిరాశపరిచేలా ఉందన్నారు. విపక్ష నేత తీరు రాష్ట్రానికి మాయని మచ్చగా నిలుస్తుందన్నారు. ప్రధాన ప్రతిపక్షం నియంతృత్వ ధోరణితో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని సిఎం ధ్వజమెత్తారు. కేవలం ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభను తప్పుదోవ పట్టించడమే విపక్షాల పనిగా మారిందని ఆయన ఫైర్ అయ్యారు.
ఏఐ సంక్షోభం ముంచుకొస్తుంది
ఏఐ సంక్షోభం ముంచుకొస్తుందని, ఏఐ ద్వారా లక్షలాది ఉద్యోగాలు పోయి నిరుద్యోగ సమస్య తలెత్తే పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారంగా విజన్ డాక్యుమెంట్‌ను సభలో ప్రవేశపెట్టామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఏ ప్రణాళికలోనైనా రాజకీయం, స్వార్థం, అధికారం కోల్పోయామన్న బాధనే విపక్షాల మాటల్లో కనిపిస్తోందని ఆరోపించారు. ఎవరు కలిసి వచ్చినా రాకపోయినా తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ 2047లో తెలంగాణను మూడు భాగాలుగా విభజించామని ఆయన తెలిపారు. ప్రస్తుతం పెట్టుబడిదారులు ఎక్కువగా హైదరాబాద్ వైపు చూస్తున్నారని, అందుకు తగ్గట్టుగానే అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
క్యూర్‌ను ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది
హైదరాబాద్ అర్బన్ ప్రాంతం క్యూర్‌ను ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉందని సిఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై నగరాల్లోని పరిస్థితులు మనకు కనువిప్పు కావాలన్నారు. ముందుచూపులో భాగంగానే హైదరాబాద్‌లో చెరువులను పునరుద్ధరిస్తున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. చెరువులను కబ్జాల చెర నుంచి విడిపించి పునరుజ్జీవనం చేస్తున్నామని, బతుకమ్మకుంట, నల్లచెరువు, బుమ్రుఖ్‌ఉద్దౌలా చెరువులను పునరుద్ధరించామని సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
హైదరాబాద్‌లో నాలాలపై 28 వేల అక్రమ కట్టడాలు
హైదరాబాద్‌లో నాలాలపై 28 వేల అక్రమ కట్టడాలు ఉన్నాయని గతంలో కెసిఆర్ ప్రకటించారని ముఖ్యమంత్రి తెలిపారు. నాలాలపై నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చాలని గతంలో కెటిఆర్ ఆదేశాలు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ కార్యాచరణనే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని ఆయన స్పష్టం చేశారు. గతంలో వాళ్లు చెప్పిన మాటలనే ఇవాళ తప్పుపడుతూ దుష్ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బిజెపి నేతలు సబర్మతి, గంగానది, యమున ప్రాజెక్టులను సమర్థించి మూసీ ప్రాజెక్టును ఎందుకు తప్పుపడుతున్నారని సిఎం ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ముంపు, కాలుష్యం సమస్యను పరిష్కరించాలని నిర్ణయించినట్లు సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అందులో భాగంగానే భారీ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.
భవిష్యత్ ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు
భవిష్యత్ ప్రణాళికతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రధానిగా జవహర్‌లాల్ నెహ్రూ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారని సిఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. విద్య, సాగునీటి రంగాలకు కాంగ్రెస్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే దేశంలో అనేక భారీ ప్రాజెక్టులు, ప్రముఖ విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు వెలిశాయని ఆయన పేర్కొన్నారు. నాడు దొరల ఆధీనంలో ఉన్న భూములను సైతం ఇందిరాగాంధీ పేదలకు పంచిపెట్టారని సిఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. హరిత విప్లవం ద్వారా ఆకలి తీర్చడమే కాదు, దేశంలో సరిపడా ఆహార ఉత్పత్తి జరిగేలా చేశారన్నారు. ఫలితంగా ఇతర దేశాలకు ధాన్యం ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరిందని ఆయన వివరించారు.
ఇందిరాగాంధీ పేదలకు బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారని, ఆమె హయాంలో గరీబీ హఠావో, 20 సూత్రాల పథకం వంటివి మైలురాళ్లుగా నిలిచాయని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రధానిగా నెహ్రూ బాధ్యతలు స్వీకరించిన సమయంలో దేశం మత కల్లోలాలతో ఉందని ఆయన కేవలం వారసత్వంగా ప్రధాని కాలేదని రేవంత్ అన్నారు. విద్య, సాగునీటితోనే దేశం ముందుకు వెళ్తుందని నెహ్రూ నమ్మారని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 1950 నుంచి 1990 వరకు నెహ్రూ, ఇందిరా గాంధీల సేవలు దేశ ప్రజలను ఎంతగానో ప్రభావితం చేశాయని, 1990 తర్వాతే భారత్ ప్రపంచంతో పోటీ పడే స్థాయికి చేరుకుందని ఆయన తెలిపారు.
అక్షరాల రూపంలో ఉన్న ఆలోచనలు కాదు
రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం కేవలం అక్షరాల రూపంలో ఉన్న ఆలోచనలు కాదని, తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శి అని ఆయన అన్నారు. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ రాష్ట్రం ఎదగడానికి అవసరమైన విశిష్ట ప్రణాళికగా ఆయన తెలిపారు. అటువంటి గొప్ప సంకల్పాన్ని, పవిత్ర శాసన సభ వేదిక నుంచి రాష్ట్ర ప్రజల ముందు ఉంచిన గవర్నర్ శుక్లాకు ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు.
అప్పట్లో అక్రమం, ఇప్పుడు సక్రమం ఎలా అయ్యిందో చెప్పాలి
గత ప్రభుత్వంలో అక్రమ నిర్మాణాలపై సభలో కెసిఆర్, కెటిఆర్‌లు మాట్లాడిన మాటలను సభకు సిఎం రేవంత్‌రెడ్డి వినిపించారు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆక్రమణలను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేయాలని వారు మాట్లాడారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అప్పుడు సక్రమం అని చెప్పిన వాళ్లకు ఇప్పుడు అక్రమం ఎలా అయ్యిందని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మీరు మాట్లాడిన మాటలను ప్రజలు అప్పుడే మర్చిపోయారనుకున్నారా? మూసీ ఉప్పల్ భగాయత్ లో మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూసొద్దాం రండి, ఎవరెవరు ఎక్కడ ఆక్రమించుకున్నారో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేద్దామని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
కాలుష్య నియంత్రణలో భాగంగా ఈవీ వాహనాలు కొనుగోలు చేసే వారికి పన్ను మినహాయించామని ఆయన తెలిపారు. త్వరలో క్యూర్ పరిధిలోని ఆటోలను ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేసి ఈవీ వాహనాలుగా మార్చబోతున్నామని, మన నగరాన్ని మనం పరిరక్షించుకోకపోతే, చెరువులను పునరుద్ధరించుకోకపోతే భవిష్యత్ తరం మనల్ని క్షమించదని ఆయన తెలిపారు.
గత ప్రభుత్వం పదేళ్ల పాటు కొత్త రేషన్‌కార్డులు ఇవ్వలేదు
నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నందునే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది తమ లక్ష్యమని సిఎం అన్నారు. 1,200 మంది యువత బలిదానాలతో తెలంగాణ వచ్చిందని, పేద యువత కష్టపడి గ్రూప్-1 ఉద్యోగాలు సాధిస్తే వాటిపై కూడా కేసులు వేశారని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్ల పాటు కొత్త రేషన్‌కార్డులు ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వం పదేళ్ల పాటు కొత్త రేషన్‌కార్డులు ఇవ్వలేదని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక 13 లక్షల కొత్త రేషన్‌కార్డులు ఇచ్చి, సన్నబియ్యం కూడా ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్‌కు మూడు బుల్లెట్ రైళ్లు
ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి ఇప్పటికే జాతీయ రహదారి నంబర్ కూడా కేటాయించారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.హైదరాబాద్‌కు మూడు బుల్లెట్ రైళ్లు రానున్నాయని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. నగరానికి పరిశ్రమలు తీసుకురావడానికి రేడియల్ రోడ్లు వేస్తున్నామన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం వేసే రోడ్లను కూడా తప్పు పడుతున్నారన్నారు. రైతును రాజుగా చేసేందుకే రూరల్ అగ్రికల్చరల్ రీజియన్‌పై దృష్టి సారించామన్నారు. టాటా సంస్థతో కలిసి ఐటీఐలను ఏటిసిలుగా అభివృద్ధి చేసి యువతకు శిక్షణ ఇస్తున్నామన్నారు.
సోనియాగాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారం
సోనియాగాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యిందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని గతంలో కెసిఆర్ స్వయంగా శాసనసభలోనే చెప్పారన్నారు. మహిళా సంఘాలకు రూ.57 వేల కోట్ల రుణాలు ఇచ్చామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మహిళా సంఘాల రుణాలపై వడ్డీ రాయితీ కోసం రూ.1,900 కోట్లు ఇచ్చామన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం వేసే రోడ్లను కూడా తప్పు పడుతున్నారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నగరానికి పరిశ్రమలు తీసుకురావడానికి రేడియల్ రోడ్లు వేస్తున్నామని సిఎం అన్నారు.
దేశంలో 9వ స్థానానికి హైదరాబాద్ మెట్రో
అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీ లేదని, బిఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు మెట్రో విస్తరణను పట్టించుకోలేదని సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మెట్రోను విస్తరించేందుకు తాము ఎంతో కష్టపడుతున్నామన్నారు. ఒకప్పుడు హైదరాబాద్ మెట్రో ఢిల్లీ తర్వాత రెండోస్థానంలో ఉండేదని, హైదరాబాద్ మెట్రో ఇప్పుడు దేశంలో 9వ స్థానానికి పడిపోయిందన్నారు. కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముకుంటే బిఆర్‌ఎస్ వాళ్లు ఓఆర్‌ఆర్‌ను అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ ఈనెల 20వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. 20వ తేదీన బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనుంది. ఇలా ఉండగా శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడారు.