
న్యూఢిల్లీ/ఇండోర్: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో బుధవారం విషాదం నెలకొంది. రెండు వేర్వేరు అగ్ని ప్రమాదాలలో మొత్తం 17 మంది దుర్మరణం చెందారు. ఢిల్లీలోని పాలం మెట్రోస్టేషన్ సమీపంలోని రామ్‌చౌక్ మార్కెట్‌లోని అపార్ట్‌మెంట్‌లో చెలరేగిన మంటల్లో ఓ కుటుంబానికి చెందిన తొమ్మండుగురు సజీవ దహనం చెందారు. వీరిలో 70 సంవత్సరాల వృద్ధురాలు, ఆమె ముగ్గురు మనవరాళ్లు ఉన్నారు. వీరిలో మూడేండ్ల బాలిక కూడా ఉంది. ఈ ఘటన హృదయవిదారకం అయింది, ముగ్గురు గాయపడ్డారు. ఈ భవనం బేస్‌మెంట్‌లో ఓ బట్టల దుకాణం, కాస్మోటిక్ షోరూం ఉన్నాయి వీటి యజమాని రాజేందర్ రెండో మూడో అంతస్తుల్లో తన కుటుంబంతో ఉంటున్నాడు.
మంటలు ముందు మొదటి అంతస్తులో తలెత్తి, తరువాత వేగంగా ఇతర అంతస్తులకు పాకాయి. ఎక్కువగా మండే స్వభావం ఉండే సౌందర్య సాధనాలు, పర్‌ఫ్యూమ్స్‌తో మంటలు చెలరేగాయి. స్థానిక మార్కెట్ సంఘం అధ్యక్షులు అయిన రాజేందర్ తన పెద్ద కుటుంబంతో ఉంటున్నారు. ఐదుగురు కమారులు, కోడళ్లు, ఓ కూతురు, ఏడుగురు మనవలుమనవరాళ్లతో నివసిస్తున్నారు. రాజేందర్ భార్య 70 సంవత్సరాల లాడో కూడా మంటల్లో చనిపోయారు. కుటుంబ సభ్యులు కొందరు ప్రయాణాలలో ఉండటంతో ముప్పు తప్పింది. కింది అంతస్తులో వస్త్రాల షాపు ఉండటం, సుగంధ ద్రవ్యాలు మంటలతో కాలిపోవడంతో వేగంగా మంటలు అంటుకున్నట్లు, అంతా నిద్రలో ఉండటం వల్ల మంటల నుంచి తప్పించుకోలేకపోయినట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరు కిటికీ నుంచి కిందకు దూకి గాయపడ్డారు. నివాసాలలో కిటికీలు మూసివేసి ఉండటం, బయటకు వెళ్లేందుకు దారిలేకపోవడంతో దారుణం జరిగింది.
ఇవి ఛార్జింగ్ పాయింట్ పేలుడు.. ఇండోర్ మంటల్లో 8 మంది ఆహుతి
బుధవారం ఉదయం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బ్రజేశ్వరీ అనెక్స్ కాలనీలోని మూడంతస్తుల భవనం వెలుపల ఎలక్ట్రిక్ వాహనం (ఇవి) చార్జింగ్ పాయింట్ పేలుడులో ఎనమండుగురు ఆహుతి అయ్యారు. మృతులలో ఇద్దరు బాలలు, ముగ్గురు మహిళలు ఉన్నారు. తెల్లవారు జామున పేలుడుతో భవనానికి మంటలు అంటుకున్నాయని ఇండోర్ పోలీసు అధికారి కుందన్ మండ్లోయ్ తెలిపారు. ఇవి వాహనం ఒకటి రాత్రి పూట చార్జింగ్‌కు పెట్టారు. ఉన్నట్లుండి ఛార్జింగ్ పాయింట్ పేలింది. దీనితో ముందు అక్కడ ఛార్జింగ్ అవుతున్న కారు మంటల్లో చిక్కింది. తరువాత మంటలు భవనానికి అంటుకున్నాయని కుందన్ వెల్లడించారు.
నివాసం ద్వారాలు ఎలక్ట్రానిక్ లాక్‌లతో ఉండటం, లోపలి వారిని వెంటనే బయటకు తీసుకురాలేకపోయారని వెల్లడైంది. చార్జింగ్ పాయింట్‌లో పేలుడు ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసు కమిషనర్ సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు. మంటలు లోపలికి వ్యాపించడం, వంట గ్యాసు సిలిండర్లు కూడా అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ తీవ్ర సంఘటనతో స్థానిక అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ఇవి ఛార్జింగ్‌లపై సరైన పద్దతులతో కూడిన ఎస్‌ఒపిల ఖరారుకు సిద్ధం అయ్యారు.
ప్రధాని మోడీ తీవ్ర దిగ్భాంతి.. సంతాపం, పరిహారం
రెండు వేర్వేరు ఘటనల్లో 17 మంది అగ్నికి ఆహుతి కావడంపై ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఇండోర్, పాలంలో ఘటనల్లో కుటుంబాలలో నెలకొన్న విషాదం కలచివేసిందని పేర్కొంటూ ప్రకటన వెలువరించారు. ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి రూ 2 లక్షల సాయం ప్రకటించారు. గాయపడ్డ వారికి రూ 50000 సాయం అందుతుంది.