
మూసీ ప్రాజెక్ట్ మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. గాంధీ సరోవర్, రాహుల్ గాంధీ సరోవర్ పేర్లతో కొత్త నాటకాలు ఆడుతున్నారా..? అని ప్రశ్నించారు. అసెంబ్లీ లాబీలో బుధవారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అమీన్‌పూర్‌లో కూల్చివేసిన ఇళ్లకు హైకోర్టు స్టే ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ప్రభుత్వం చట్టవ్యతిరేక చర్యలు చేపడుతోందని అన్నారు. అసెంబ్లీలో డ్రగ్స్ టెస్ట్ చేయమని తాము సవాల్ విసిరినా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. తమ పార్టీకి చెందిన వారిపై ఆరోపణలు వచ్చినా విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు. కానీ, అధికార పార్టీ మాత్రం తప్పించుకుంటోందని అన్నారు.
తమ పార్టీ బీ ఫాం మీద గెలిచిన వారికి క్లీన్ చిట్ ఇచ్చారని తెలిపారు. బడ్వే అని తిడితే కూడా ఖండించలేదని, అలాంటప్పుడు కెసిఆర్ అసెంబ్లీకి ఎందుకు వస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం తమనే తట్టుకోలేకపోతుంది..కెసిఆర్‌ను ఎలా తట్టుకుంటారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి రోజురోజుకు బయటపడుతోందని, ఇంకా ఎన్నో విషయాలు వెలుగులోకి రావాల్సి ఉందని పేర్కొన్నారు.పొంగులేటి కుమారుడు కబ్జాలు చేసిన ఘటనలో సంబంధిత అధికారిని బదిలీ చేశారని అన్నారు.