Reading Time: < 1 minute

వచ్చే ఏడాది జూన్ నాటికి రాష్ట్రంలో హ్యామ్ రోడ్లు పూర్తి చేస్తాం

ఇంకా టెండర్లు కూడా తెరవక ముందే ఆరోపణలు చేయడం సరికాదు

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

అసెంబ్లీలో రోడ్లపై సభ్యులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన మంత్రి

మనతెలంగాణ/హైదరాబాద్ : 2028 జూన్ నాటికి దేశంలో తెలంగాణ మోడల్‌గా నిలిచేలా హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) పద్ధతిలో రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో సుమారు రూ.30 వేల కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని తెలిపారు. దాదాపు రూ.17 వేల కోట్ల విలువైన రోడ్ల నిర్మాణానికి ఇంకా టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఏప్రిల్ 10 నాటికి అగ్రిమెంట్లు పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

వచ్చే ఏడాది జూన్ నాటికి రాష్ట్రంలో హ్యామ్ రోడ్లు పూర్తి చేస్తామన్నారు. రహదారులు రాష్ట్ర అభివృద్ధికి సూచికలు అని, పేదల ఇంటి ముందు రోడ్డు ఉంటేనే నిజమైన డెవలప్‌మెంట్ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో రోడ్లపై అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎంఎల్‌ఎలు హరీష్ రావు, సునీతా లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు అడిగిన ప్రశ్నలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు హ్యామ్ రోడ్ల నిర్మాణం జరగుతుందని, ఇంకా టెండర్లు కూడా తెరవక ముందే బిఆర్‌ఎస్ సభ్యులు హరీష్ రావు ఆరోపణలు మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా గత ప్రభుత్వ పెద్దలు సుమారు రూ.4,600 కోట్ల బిల్లులు పెండింగులో పెట్టారని మండిపడ్డారు.