Reading Time: < 1 minute

హైదరాబాద్: ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని కరీనంగర్ సిపి గౌస్ ఆలంపై ఉన్న అక్రమాలపై ప్రత్యేక సిట్ ద్వారా విచారణ చేపట్టాలని బిఆర్‌ఎస్ శాసనసభ్యుడు కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన పక్కా ఆధారాలు, సమాచారం తన వద్ద ఉందని వాటిని అందించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. శాసనసభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్‌లో ఉండాల్సిన ప్రభుత్వ వాహనం హైదరాబాద్‌లో తిరుగుతోందని, ఇందుకు కరీంనగర్‌లోని ఇద్దరు కానిస్టేబుళ్లను కూడా వినియోగిస్తున్నారని అన్నారు.

సిపి సతీమణి తన స్నేహితులతో కలిసి ఫైరింగ్ జోన్‌లో ఫైరింగ్ చేయడం వల్ల ఒక వృద్దురాలికి గాయమైందని తెలిపారు. అంతే కాకుండా కరీంనగర్‌లో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని అన్నారు. ఇప్పటికే సిపిపై ఉన్న అవినీతి ఆరోపణలు, తాజాగా జరిగిన అక్రమాలపై సిట్ ద్వారా విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు. ఇందుకు సభలో ఉన్న మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని అన్నారు. ఆరోపణల్లో వాస్తవాల గురించి తెలుసుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.