Reading Time: < 1 minute

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు పదవీ కాలం పొడిగిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. ఆయన పదవీ కాలాన్ని మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర హోం శాఖ పరిధిలోని పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (డిఓపిటి) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి బుధవారం అధికారిక సమాచారం అందింది. తాజా పరిణామాల నేపథ్యంలో జూన్ నెలాఖరు వరకు రామకృష్ణా రావు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు.

గతేడాది ఆగస్టు 31వ తేదీన రామకృష్ణా రావు పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఆయన సర్వీసును పొడిగించాలని డిఓపిటిని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో 7 నెలలు ఆయన సర్వీసును పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు వెలువరించింది. అయితే, ఈనెల 31వ తేదీతో పదవీ కాలానికి సంబంధించి గడువు ముగుస్తుండటంతో మరోసారి ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం డిఓపిటికి లేఖ రాయగా సానుకూలంగా స్పందించింది. దీంతో మరో మూడు నెలల పాటు రామకృష్ణా రావు సిఎస్ పదవిలో కొనసాగనున్నారు.