
హుస్నాబాద్ నియోజకవర్గంలోని నర్మెట సభా వేదిక నుంచి ఈనెల 22వ తేదీన 70 లక్షల మంది రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులను సిఎం రేవంత్‌రెడ్డి విడుదల చేయనున్నట్టు మంత్రి తుమ్మల తెలిపారు. 70 లక్షల మందికి ఒకేసారి ఖాతాలో డబ్బులు వేసే ఏకైక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమని ఆయన పేర్కొన్నారు. గతంలో 20 లక్షల మంది రైతులకు 20 వేల కోట్లు రైతు రుణమాఫీ చేశామని, గతంలో 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు విడుదల చేసినట్టు మంత్రి తుమ్మల తెలిపారు. ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ రైతు సంక్షేమ కార్యక్రమాలు ఆగవద్దని సిఎం చెప్పినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఈ ప్రభుత్వానికి రైతాంగమే ప్రాధాన్యం అని ఆయన చెప్పారు. ఎన్నికల్లో రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన మేరకు చేసి చూపించామన్నారు. మొక్కజొన్న కొనుగోళ్లపై ధర్నాలు చేయడం తేలికైన పని కానీ, ధర్నాలు చేస్తున్న వారే కేంద్రంలో ఉన్నారని వారు కొనుగోలు చేయడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోయినా తెలంగాణ ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్లను బుధవారం నుంచే ప్రారంభించిందని ఆయన చెప్పారు.