Reading Time: < 1 minute

మనతెలంగాణ/హైదరాబాద్: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో టిజి ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఆయిల్‌ఫామ్ కర్మాగారం ప్రారంభోత్సవానికి రావాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కెటిఆర్‌ను బుధవారం కోరారు. అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత కెసిఆర్ ఛాంబర్‌కు మంత్రి తుమ్మల స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 22న సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్‌ఫాం ఫ్యాక్టరీ ప్రారంభం జరుగనుంది. నర్మెట శివారులో 62 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్లతో తెలంగాణ ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలి రిఫైన్డ్ పామాయిల్ ఫ్యాక్టరీని ఆధునిక టెక్నాలజీతో ప్రభుత్వం నిర్మించింది.

ఈ ఆయిల్ పాం ఫ్యాక్టరీలో నూనెను ఉత్పత్తి చేయడంతో పాటు ఇక్కడి నుంచే నేరుగా మారెట్లోకి పంపేలా ఏర్పాట్లు చేశారు. ఆయిల్‌ఫామ్ పండ్ల గుజ్జు నుంచి ముడి నూనె తీసి రిఫైన్డ్ చేసి పామాయిల్‌ను ప్యాకెట్స్ రూపంలో మార్కెట్‌లోకి తీసుకొస్తారు. 10 కోట్ల లీటర్ల నిలువ సామర్థ్యంతో నీళ్ల ట్యాంకును ఏర్పాటు చేశారు. ఆయిల్‌ఫామ్ గెలల నుంచి వెలువడే బయోమాస్ వ్యర్థాలతో విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. 4 మెగావాట్ల సెల్ఫ్ జనరేషన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఒక్క యూనిట్‌కు రూ.1.50 మాత్రమే ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి కానుండటంతో భారం తప్పనుంది. వాడిన నీటిని వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ద్వారా రీ సైక్లింగ్ చేసే పద్ధతి కూడా ఉంది. ఈ ఫ్యాక్టరీలో మొదట గంటకు 30 టన్నుల గెలల క్రషింగ్ సామర్థ్యం, గెలల పరిమాణం పెరుగుతున్న కొద్దీ క్రషింగ్ సామర్థ్యాన్ని గంటకు 120 టన్నులకు పెంచుకునే వీలు కల్పించారు. గంటకు 120 టన్నుల గెలల క్రషింగ్ సామర్థ్యంతో ఫ్యాక్టరీ కట్టడం దేశం లోనే తొలిసారి.