
బడ్జెట్‌లో బ్రాహ్మణ పరిషత్‌కు రూ. 200 కోట్లకు వినతి
మన తెలంగాణ/హైదరాబాద్‌ః ఆర్థికంగా వెనుకబడి అర్హులైన బ్రాహ్మణులను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర ఐటి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు బ్రాహ్మణ సంఘాల నాయకులకు హామీ ఇచ్చారు. ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణులను ఆదుకోవడానికి బ్రాహ్మణ పరిషత్‌కు రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించాలని బ్రాహ్మణ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్ (బాస్) నాయకులు బుధవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబును కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.
వివిధ బ్రాహ్మణ సంఘాలతో కలిపి ఏర్పాటైన ‘బాస్’ ప్రధాన సమన్వయకర్త బసవరాజు శ్రీనివాస్ అధ్వర్యంలో ఇతర ముఖ్య నాయకులు ఎన్. లక్ష్మీనారాయణ, కైలాష్, సూర్య ప్రకాష్, ప్రమోద్, రాఘవురావు, శ్రీనివాస రావు తదితరులు అసెంబ్లీకి వచ్చి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను, మంత్రి శ్రీధర్ బాబును కలిసి సమస్యలను వివరించారు. బ్రాహ్మణ పరిషత్ ద్వారా వేదహిత, వేద పాఠశాల, వేదహిత-వేద పండిట్స్, వివేకానంద ఓవర్సీస్ ఎడ్యుకేషన్, టెస్ట్ స్కీం, బ్రాహ్మణ భవనాలు, ఉద్యొగార్థులకు ఆర్థిక సహాయం, పెన్షన్, నిరుద్యోగ బ్రాహ్మణులకు ఉద్యోగాలు కల్పించడం తదితర సమస్యలను, డిమాండ్లను వారు వివరించారు. గత రెండేళ్ళుగా బ్రాహ్మణులకు సరైన నిధులు లేక ఏ పథకమూ అమలు కాకపోవడంతో విద్యార్థులు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు.
సంక్షేమ భవనాలకు నిధులు లేకపోవడంతో నిర్మాణ దశలోనే నిలిచిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.పెన్షన్లు, ఆర్థిక సహాయం లేక పండితులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని వారు చెప్పారు. గత ఏడాది కేటాయించిన నిధులు పాత బకాయిలకే సరిపోలేదన్నారు. దాదాపు కొన్ని వందల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, దీంతో కొత్త దరఖాస్తులను పిలవడం లేదని వారు వివరించారు. కాబట్టి బ్రాహ్మణుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది బడ్జెట్‌లో రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించాలని వారు కోరాఉ. అందుకు స్పందించిన ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణులను అన్ని విధాల ఆదుకుంటామని వారికి భరోసా ఇచ్చారు.