Reading Time: < 1 minute

హైదరాబాద్: మూసీ ప్రాజెక్టు తొలి దశ డిపిఆర్ తయరైందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తొలి దశ డిపిఆర్ రూ.6500 నుంచి రూ. 7000 కోట్లు అని, మూసీ పునర్నిర్మాణంలో 1435 నిర్మాణాలు ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నాయని వివరించారు. బుధవారం శాసన సభలో మూసీ నది పునర్మిర్మాణంపై శ్రీధర్ బాబు ప్రసంగించారు. తుది ఎన్యూమరేషన్ కొనసాగుతుందని, బఫర్ జోన్‌లో ఉన్న వారికి టిడిఆర్ ఇస్తామని ప్రకటించారు. 2013 చట్టం ప్రకారం భూసేకరణ, పునరావాసం ఉంటుందని, కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన జివొ ప్రకారమే బఫర్ జోన్ నిర్ణయించామని తెలియజేశారు. తాము కొత్తగా బఫర్‌జోన్ నిర్ణయించలేదని, 2024 డిసెంబర్‌లో మెయిన్‌హార్ట్‌కు డిపిఆర్ బాధ్యతలు అప్పగించామని, 2026 ఫిబ్రవరిలో మెయిన్‌హార్ట్ సంస్థ డిపిఆర్ అప్పగించామని, బిఆర్‌ఎస్ నేత కెటిఆర్ ఆరోపిస్తున్నట్టు మూసీ డిపిఆర్ రెండు నెలల్లో పూర్తి కాలేదని చురకలంటించారు. వచ్చే ఎడిబి బోర్డు మీటింగ్‌లో మూసీ ప్రాజెక్టుకు అనుమతి లభించే అవకాశం ఉందని, బిఆర్‌ఎస్ చేపట్టిన ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ ఆపేసిందని ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని, ప్రాజెక్టులను తాము నిలిపివేసినట్టు బిఆర్‌ఎస్ ఆరోపించడం సరికాదని దుయ్యబట్టారు. ఎస్‌టిపిలకు సంబంధించి బిఆర్‌ఎస్ హయాంలో 30 శాతం పనులు పూర్తి చేశారని, పెండింగ్‌లో ఉన్న 70 శాతం పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందని స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ హయాంలో చేసిన పనులు చిన్న వరదకే కొట్టుకుపోయాయని ఎద్దేవా చేశారు.