Reading Time: 2 minutes

పశ్చిమ ఆసియాలో యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి కుదుపునకు గురవుతోంది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో నెలకొన్న ప్రతిష్టంభన కేవలం ప్రాంతీయ ఉద్రిక్తత మాత్రమే కాదు, అది గ్లోబల్ ఎనర్జీ సంక్షోభానికి ప్రధాన హేతువుగా మారుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య కొనసాగుతున్న పోరు అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను అతలాకుతలం చేస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో బ్యారెల్‌కు 60 డాలర్లుగా ఉన్న ముడిచమురు ధర, సోమవారం నాటికి ఏకంగా 120 డాలర్లకు చేరుకోవడం ఆందోళనకరం. కేవలం రెండు నెలల వ్యవధిలోనే ధరలు రెట్టింపు కావడం, 2022 నాటి రష్యా- ఉక్రెయిన్ యుద్ధం సృష్టించిన ప్రకంపనలను గుర్తుకు తెస్తోంది. ఇరాన్, ఒమన్ దేశాల మధ్య కేవలం 33 కిలోమీటర్ల వెడల్పున్న ఈ సన్నని జలమార్గం గుండానే ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో 20 శాతం సాగుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఏర్పడిన అడ్డంకుల వల్ల కువైట్, ఇరాక్, యుఎఇ వంటి దేశాలు తమ చమురు ఎగుమతులను నిలిపివేయాల్సి వచ్చింది. సౌదీ అరేబియాకు చెందిన అరామ్‌కో సంస్థ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నప్పటికీ, పూర్తిస్థాయిలో సరఫరా చేయలేకపోతోంది.

గ్యాస్ సరఫరాకు గ్రహణం

చమురుతోపాటు ఎల్‌ఎన్‌జి సరఫరాపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఎన్‌జి ఎగుమతి కేంద్రమైన ఖతార్‌లోని రాస్ లఫ్ఫాన్ ప్లాంట్‌పై డ్రోన్ దాడులు జరగడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. ఫలితంగా ఒక్క వారంలోనే గ్యాస్ దిగుమతులు 26% పడిపోయాయి. వేసవి సమీపిస్తున్న తరుణంలో ఆసియా దేశాలకు, నిల్వలు పెంచుకోవాల్సిన ఐరోపా దేశాలకు ఇది పెద్ద దెబ్బ. అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు గ్యాస్ కొరతను తీర్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, సరఫరా గొలుసు తెగిపోవడంతో అవి ఎంతవరకు సఫలమవుతాయో వేచిచూడాలి.

భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నది. చమురు ధరలో ప్రతి 10 డాలర్ల పెంపు మన దేశ దిగుమతి బిల్లుపై సుమారు 12 నుండి 15 బిలియన్ డాలర్ల భారాన్ని మోపుతుంది. దీనివల్ల పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరిగి సామాన్యుడిపై భారం పడుతుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయి. ద్రవ్యోల్బణం పెరిగితే వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉండదు. చమురు ధరలు పెరిగితే స్టాక్ మార్కెట్లు కుదేలవడం సహజం. ఈ యుద్ధం మొదలైనప్పటి నుండి భారత సెన్సెక్స్ సుమారు 5,100 పాయింట్లు నష్టపోవడం పెట్టుబడిదారుల్లో ఉన్న భయాందోళనలకు నిదర్శనం. కంపెనీల నిర్వహణ వ్యయం పెరగడం వల్ల వాటి లాభాలు తగ్గుతాయి, తద్వారా షేర్ల ధరలు పడిపోతాయి. అయితే, గతంలో సంభవించిన యుద్ధాలు, మహమ్మారుల నుంచి మార్కెట్లు పుంజుకున్న చరిత్ర ఉంది. అందుకే ఇన్వెస్టర్లు ఆందోళనతో పెట్టుబడులను ఉపసంహరించుకోకుండా ఓపిక పట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

హర్మూజ్ జలసంధి తెరుచుకోవడంపైనే ప్రపంచ ఆర్థిక భవిష్యత్తు ఆధారపడి ఉంది. యుద్ధం త్వరగా ముగిస్తే ధరలు 65 డాలర్లకు దిగిరావచ్చు, లేదంటే 150 డాలర్లకు చేరినా ఆశ్చర్యం లేదు. అంతర్జాతీయ సమాజం సమష్టిగా స్పందించి ఈ ఉద్రిక్తతలను తగ్గించకపోతే, ప్రపంచం మరో భారీ ఆర్థిక మాంద్యంలోకి జారుకునే ప్రమాదం ఉంది. చమురు అవసరాల కోసం గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడే భారత్, చైనా వంటి దేశాలకు ఈ పరిస్థితి కత్తిమీద సాములా మారింది. అయితే, భారత ప్రభుత్వం దౌత్యనీతిని ప్రదర్శించి ఇరాన్ పాలకులతో జరిపిన చర్చలు కొంత ఫలితాన్నిచ్చాయి. భారత్‌ను మిత్రదేశంగా పరిగణిస్తూ హర్మూజ్ గుండా భారత నౌకలను అనుమతించడం కొంత ఊరటనిచ్చే అంశం. అయినప్పటికీ, భవిష్యత్తులో యుద్ధ తీవ్రత పెరిగితే ఈ వెసులుబాటు ఎంతవరకు కొనసాగుతుందన్నది సందేహమే.

చమురు సంక్షోభం కేవలం పెట్రోల్, డీజిల్‌కే పరిమితం కాలేదు. గ్యాస్ కొరత, ఎరువుల ధరల పెరుగుదల భారత పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా దేశంలో వంటగ్యాస్ కొరత కనిపిస్తుండటం సామాన్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గ్యాస్ ఏజెన్సీల ముందు కనిపిస్తున్న బారులు దేనికి సంకేతం? బ్లాక్ మార్కెట్ ముఠాలు ఈ అస్తవ్యస్త పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇంకా చక్కబడలేదు.

రష్యా, వెనెజువెలా వైపు భారత్ చూపు..

ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి భారత్ ఇప్పుడు రష్యా, వెనెజువెలాల వైపు మొగ్గు చూపుతోంది. రష్యా నుంచి చమురు దిగుమతులపై అమెరికా తన అభ్యంతరాలను పక్కనబెట్టడం గమనార్హం. వెనెజువెలాలో చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నా, అక్కడ నెలకొన్న రాజకీయ అస్థిరత, చమురు శుద్ధిలో ఉన్న సాంకేతిక ఇబ్బందులు భారత్‌కు సవాల్‌గా మారాయి. ఈ గందరగోళానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొండివైఖరే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం వల్ల తలెత్తే పరిణామాలను అంచనా వేయకుండా, ఆధిపత్య పోరులో భాగంగా దాడులకు దిగడం అమెరికా స్వయంకృతాపరాధమే. ఇరాన్‌లో మార్పు కోసం అమెరికా వేసిన ఎత్తుగడలు ఫలించకపోగా, యుద్ధం మరింత కాలం కొనసాగేలా కనిపిస్తోంది. అంతర్జాతీయ శక్తి సంస్థ (ఐఇఎ) అత్యవసర నిల్వల నుంచి చమురును విడుదల చేసినప్పటికీ ధరలు 100 డాలర్ల మార్కును దాటాయి. యుద్ధం ముగిసి, సరఫరా వ్యవస్థలు పునరుద్ధరించబడే వరకు ప్రపంచానికి ఇంధన గండం పొంచే ఉంటుంది. అగ్రరాజ్యాలు తమ పంతాలను వీడి శాంతి మార్గంలో పయనించకుంటే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని దెబ్బ తినడం ఖాయం.

పసుపులేటి శ్రీలక్ష్మి

91003 65111