
హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు సమాధానం ఎవరికీ సంతృప్తిగా లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. తొలి దశలో రూ.7 వేల కోట్లు అంటున్నారని, ఇంకా ఎన్ని దశలు ఉన్నాయని ప్రశ్నించారు. బుధవారం శాసన సభలో మూసీ పునర్నిర్మాణంపై కెటిఆర్ మాట్లాడారు. రూ.16 వేల కోట్లయ్యే ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్షన్నర కోట్లు అని చెబుతున్నారని, మూసీ డిపిఆర్ తయారు చేసేందుకు 18 నెలలు పడుతుందని జనవరిలో మంత్రి చెప్పారని, ఇప్పుడేమో డిపిఆర్ పూర్తయిందని మంత్రి చెబుతున్నారని, 18 నెలలు పడుతుందని చెప్పి రెండు నెలల్లోనే పూర్తి చేశారా? అని ప్రశ్నించారు. ఒకవేళ డిపిఆర్ పూర్తి చేసి ఉంటే తమ ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. డిపిఆర్ తమకు ఇంతవరకు అందలేదని ఎడిబి చెబుతుందని, డిపిఆర్ తయారు చేయకుండానే తయరైందని చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారని కెటిఆర్ దుయ్యబట్టారు. మూసీ డిపిఆర్ బాధ్యతలను మెయిన్‌హార్ట్‌కు అప్పగించారని, మెయిన్‌హార్ట్ సంస్థపై పాకిస్థాన్ ప్రభుత్వం రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేసిందని గుర్తు చేశారు. మూసీ పునర్నిర్మాణంలో 1400 నిర్మాణాలు పోతాయని మంత్రి చెబుతున్నారని, మూసీ పునర్మిర్మాణంలో పది వేల నిర్మాణాలు పోతాయని గెజిట్ చెబుతోందని దుయ్యబట్టారు. మంత్రి చెబుతున్నది కరెక్టా? ప్రభుత్వ గెజిట్‌లో చెబుతున్నది కరెక్టా? అని కెటిఆర్ ప్రశ్నించారు. మూసీని మురికికూపంగా మార్చిందే కాంగ్రెస్ అని దుయ్యబట్టారు.