Reading Time: < 1 minute

హైదరాబాద్: మూసీ పరివాహక ప్రజలు అపరిశుభ్రత వాతావరణంలో జీవిస్తున్నారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. మూసీ ప్రజల జీవనగతులు మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని, మూసీ అభివృద్ధి కాకూడదని ప్రతిపక్షం కోరుకుంటుందని ద్వజమెత్తారు. హైదరాబాద్ నగరానికి మణిహారంగా మూసీని మార్చాలని తాము ప్రయత్నం చేస్తున్నామని, మూసీ పరివాహక ప్రజలకు పునరావాసం కల్పిస్తామని స్పష్టం చేశారు. మూసీ ప్రజలు మురికికూపంలో బతకాలనేదే ప్రతిపక్షం కోరిక అని, ప్రతిపక్షం తీరు సరికాదని ధ్వజమెత్తారు. మూసీలోకి వచ్చే ప్రతినాళాకు ఎస్‌టిపి పెట్టి శుద్ధి చేస్తామని, ప్రతిపక్షం ఏవైనా మెరుగైన సలహాలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. మూసీ పునరుజ్జీవం ఒక సామాజిక బాధ్యత. మురుగు నీరు, ఈగలు, దోమలు, రోగాల మధ్య దయనీయ పరిస్థితుల్లో బతుకుతున్న పేదల జీవితాలను మార్చాలనేదే మా ప్రభుత్వ సంకల్పమని, మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్న వారు పేదలు అదే మురికి కూపంలో ఉండాలని కోరుకుంటున్నారా? అని అడిగారు. నివాసాలు కోల్పోయే ప్రతి పేద కుటుంబానికి పట్టా ఉన్నా లేకపోయినా అదే ప్రాంతంలో అపార్ట్ మెంట్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారని భట్టి గుర్తు చేశారు. అంతేకాకుండా అక్కడి మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. వారి పిల్లల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించి ఉజ్వల భవిష్యత్తును అందిస్తామన్నారు. పేదవాడు పేదవాడిగానే ఉండాలని, మురికిలోనే బతకాలి అనే ధోరణి ప్రతిపక్ష పార్టీ నాయకులు వీడాలని భట్టి విమర్శించారు. ఈ మహా యజ్ఞం ద్వారా మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.