Reading Time: < 1 minute

కిచెన్‌లోని కట్టెల పొయ్యి నుంచి చెలరేగిన మంటలతో పబ్బులో అగ్నిప్రమాదం సంభవించిన సంఘటన జూబ్లీహిల్స్‌లో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్, రోడ్డు నంబర్ 36లో ఉన్న బైద బాటిల్ పబ్బులో అగ్నిప్రమాదం సంభవించింది. గ్యాస్ కొరతతో పబ్‌లోని కిచెన్‌లో కట్టెలతో వంట చేస్తున్నారు. రోజు మాదిరిగానే కట్టెల పొయ్యితో వంట చేస్తుండగా పొయ్యి నుంచి ఎగసిపడిన నిప్పు రవ్వలు పబ్బులోని థర్మకోల్‌కు అంటు కోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు పబ్బు మొత్తం అంటుకోవడంతో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పివేశారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో పబ్బులో తక్కువ మంది ఉండడంతో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.