Reading Time: < 1 minute

ప్రముఖ నటి నయనతారపై తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే పార్టీ ఎంపీ ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహిళల భద్రతపై నిర్వహించిన నిరసన సభలో పాల్గొంటూ నటి నయనతార గురించి ఎంపీ చేసిన అవమానకర వ్యాఖ్యల కారణంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. తమిళనాడు సిఎం  స్టాలిన్‌పై విమర్శ చేయాలనే ఉద్దేశంతో చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారి తీసాయి. “మీ కలలను మాకు చెప్పండి. వాటిని నెరవేర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అంటూ ఇటీవల ముఖ్యమంత్రి స్టాలిన్ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు.దీన్ని ఉద్దేశించి అన్నాడీఎంకే నేత, రాజ్యసభ ఎంపీ సీవీ షణ్ముగం మాట్లాడుతూ అబ్దుల్ కలాం మనల్ని కలలు కనమన్నారు. మన కలల్ని తనతో పంచుకోమని ఆయన (స్టాలిన్) అడుగుతున్నారు. నాకు నయనతార కావాలి.. దాన్ని ఆయన నెరవేరుస్తారా? నాకు ఆమెను పెళ్లి చేసుకోవాలని ఉంది. నాలాగే ఎవరో నయనతారతో పెళ్లి చేయమని స్టాలిన్‌ను అడిగితే ఆ కలను నెరవేర్చుతారా? అని ఆయన వ్యాఖ్యానించడం వివాదానికి కారణమైంది.

మహిళల భద్రత నిరసన సభలోనే వివాదం

ఈ వ్యాఖ్యల వివాదాన్ని మరింత పెంచిన అంశం ఏమిటంటే.. మహిళల భద్రత, గౌరవం కోసం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో షణ్ముగం ఒక మహిళ(నయనతార) గురించి అవమానకరంగా మాట్లాడటం. అక్కడే ఉన్న పార్టీ నాయకులు కూడా ఈ వ్యాఖ్యలపై నవ్వుతూ స్పందించడం విమర్శలకు మరింత కారణమైంది.

సోషల్ మీడియాలో ఆగ్రహం

షణ్ముగం చేసిన వ్యాఖ్యలు వెలుగులోకి రావడంతో వివిధ వర్గాల నుంచి తీవ్ర ప్రతికూల స్పందనలు వచ్చాయి. రాజకీయ పార్టీలు, సోషల్ మీడియా వినియోగదారులు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, కొందరు తమిళనాడు పోలీసులను ఈ అంశంపై కేసు నమోదు చేయాలని కోరగా, ఆ ఎంపీపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.మా విధానాలను విమర్శించండి. కానీ మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయకండి. నయనతారను అవమానించడం ద్వారా మహిళలందరినీ అవమానించారు. ఈ వ్యాఖ్యలు ఏమాత్రం ఆమెదయోగ్యం కాదు అని డీఎంకే పార్టీ తీవ్రంగా స్పందించింది. షణ్ముగం అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మహిళల ప్రస్తావన తెచ్చి తీవ్ర విమర్శల పాలయ్యారు.