Reading Time: < 1 minute

ఆస్పత్రుల్లో రోగులకు మత్తుమందు ఇచ్చి బంగారు ఆభరణాలు దోచుకుంటున్న మహిళ, సహకరించిన భర్తను సికింద్రాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్, మార్కెట్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 11 తులాల బంగారు ఆభరణాలు, కారు, రెండు మొబైల్ ఫోన్లు స్వాదీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…వికారాబాద్ జిల్లా, నవాబ్‌పేట మండలానికి చెందిన గౌండ్ల శిరీష డి ఫార్మసీ చదువుతోంది, ఎడులపల్లి సాయికుమార్ గౌడ్ వ్యాపారం చేస్తున్నాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడడంతో దంపతులు సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశారు. దీనిలో భాగంగా వైద్యురాలిగా నటిస్తూ ఆస్పత్రుల్లో ఉన్న రోగులకు మత్తు మందు ఇచ్చి

బంగారు ఆభరణాలు దోచుకోవాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే డాక్టర్ ఆప్రాన్ ధరించి ఆస్పత్రిలోకి ప్రవేశించి, తన వెంట తెచ్చుకున్న ’డయాజెపామ్’ అనే మత్తు ఇంజక్షన్‌ను బాధితులకు ఇచ్చేది. వారు స్పృహ కోల్పోయిన తర్వాత వారి బంగారు ఆభరణాలను దొంగిలించి పరారైంది. మార్చి 11న సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రి , అలాగే చందానగర్‌లోని సిటిజన్ ఆస్పత్రిలో రోగులకు మత్తు మందు ఇచ్చి బంగారు ఆభరణాలు చోరీ చేసింది. దొంగిలించిన సొమ్మును విలాసాలకు, షాపింగ్‌కు ఖర్చు చేసేవారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.