
ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ నిల్వ ఉంచిన కుళ్లిన చికెన్‌ను విక్రయిస్తున్న ముషీరాబాద్‌లోని ఒక చికెన్ సెంటర్‌పై వారసిగూడ పోలీసులు దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ముషీరాబాద్ బాపూజీ నగర్‌లోని ‘ఏ-1 ఫ్రెష్ చికెన్ మార్ట్’ (A-1 Fresh Chicken Mart) యజమాని షేక్ షకీల్, అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉంచిన ఫ్రోజన్ చికెన్‌ను స్థానిక ప్రజలకు మరియు చిన్న వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. సమాచారం మేరకు ఈరోజు మధ్యాహ్నం 1:00 గంటల సమయంలో వారసిగూడ సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కె. రామచంద్ర రెడ్డి తన సిబ్బంది మరియు స్వతంత్ర సాక్షులతో కలిసి సదరు చికెన్ సెంటర్‌పై ఆకస్మిక దాడి నిర్వహించారు. తనిఖీ సమయంలో సుమారు 610 కిలోల చికెన్ అత్యంత అపరిశుభ్రమైన స్థితిలో నిల్వ ఉంచినట్లు గుర్తించారు.
నిల్వ ఉంచిన మాంసం పూర్తిగా కుళ్లిపోయి, దుర్వాసన వెదజల్లుతోంది. ఆ ప్రదేశంలో ఎలుకలు, పిల్లుల సంచారం ఉండటంతో మాంసం పూర్తిగా కలుషితమైంది. సదరు చికెన్ షాపు ట్రేడింగ్ లైసెన్స్ ఏడాది క్రితమే ముగిసినప్పటికీ, నిందితుడు నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు తేలింది. మానవ వినియోగానికి పనికిరాని ఈ కుళ్లిన మాంసాన్ని నిందితుడు తెలిసి కూడా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. సికింద్రాబాద్ జోన్ డిసిపి శ్రీమతి కె. రక్షిత కృష్ణమూర్తి ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు, చిలకలగూడ ఏసిపి శ్రీ కె. శశాంక్ రెడ్డి గారి పర్యవేక్షణలో వారసిగూడ ఇన్‌స్పెక్టర్ శ్రీ జి. రాజేందర్ గౌడ్, ఎస్.ఐ శ్రీ కె. రామచంద్ర రెడ్డి మరియు సిబ్బంది ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు.