Reading Time: < 1 minute

నేనే ఇప్పుడు ట్రెండింగ్ స్టార్ అని, సోషల్ మీడియాను అసలు ప్రమోట్ చేస్తుందే తాను అని, అసలు ఈ ప్లాట్‌ఫాం అన్నింటికీ తానే అసలైన బ్రాండ్ అంబాసిడర్ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. నేను ఏం మాట్లాడినా సెన్సేషన్ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి పేర్కొన్నారు. యువతలో తనకున్న క్రేజ్‌ను చూసి గర్వపడుతున్నానని, తన వీడియోలు చూసి లక్షలాది మంది నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. సినిమాల్లో నటించే అవకాశం గురించి ఆయన మాట్లాడుతూ తెరపై కనిపించడానికి వేరే దర్శకుడి కోసమో, నిర్మాత కోసమో ఎదురుచూడాల్సిన అవసరం తనకు లేదని ఆయన అన్నారు.

తన వ్యక్తిత్వమే తనకు ఒక ఇమేజ్ తెచ్చిపెట్టిందని మల్లారెడ్డి అభిప్రాయపడ్డారు. తన మార్కు డైలాగులతో ఇప్పటికే తను ప్రజల గుండెల్లో స్టార్‌ఘా నిలిచానని ఆయన అన్నారు. ఒకవేళ తనకు సినిమాల్లో నటించాలని అనిపిస్తే, ఎవరి దగ్గరకో వెళ్లే ప్రసక్తే లేదని మాజీ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే తానే సొంతంగా సినిమా తీస్తానని, తానే అందులో కథానాయకుడిగా కనిపిస్తానని తన మనసులోని మాటను మల్లారెడ్డి బయటపెట్టారు. ఏదైనా పని మొదలుపెడితే అది గ్రాండ్‌గా ఉండాలని కోరుకుంటానని మల్లారెడ్డి తెలిపారు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటూ తనదైన పంచ్ డైలాగులతో వినోదాన్ని పంచే మల్లారెడ్డి అసెంబ్లీ లాబీల్లో మంగళవారం అదే జోష్‌తో నవ్వులు పూయించారు.