
హైదరాబాద్: మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్‌గా చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్‌ను నియమించింది. ఇక, సిట్ సభ్యులుగా గ్రేహౌండ్స్ కమాండర్ ఎం. రవీందర్, షాద్‌నగర్ డీసీపీ శిరీష, ఈగల్ ఫోర్స్ ఆఫీసర్లు సి. హరీష్‌చంద్రారెడ్డి, ఎన్. బుచ్చయ్య, మొయినాబాద్ ఎస్ హెచ్ఓ మల్లికార్జునరెడ్డి, ఎస్సైలు కోటేశ్వరరావు, సదాత్ అలీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మొయినాబాద్ ఫాం హౌస్‌లో కలకలం రేపిన డ్రగ్స్ పార్టీ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆదివారం ఈగిల్ అధికారులు బృందం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఫాం హౌస్‌లో మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలతో పాటు పెద్ద మొత్తంలో మద్యంతో పార్టీని జరుపుకుంటున్నట్లు అధికారులకు సమాచారం అందండంతో పోలీసు బృందం ఫామ్‌హౌస్ ఆవరణను చుట్టుముట్టామని, ఒక మహిళతో సహా 11 మంది వ్యక్తులు మద్యం, మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలను సేవిస్తున్నట్లు గుర్తించామన్నారు. పోలీసులు లోపలికి వెళుతున్న క్రమంలో తుపాకీ కాల్పులు జరిగాయన, పోలీస్‌లు కాల్పులు ఆపాలని హెచ్చరించడంతో కాల్పులు ఆగిపోయాయని తెలిపారు.
ఈ క్రమంలో అక్కడే ఒక వ్యక్తి చేతిలో రివాల్వర్ పట్టుకుని ఉండటం కనిపించిందని, వెంటనే ఆయుధంతో పాటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, మరొక వ్యక్తి చేతిలో ఖాళీ కార్ట్రిడ్జ్ కేసులు పట్టుకుని ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ప్రాథమిక దర్యాప్తులో తుపాకి పట్టుకున్న వ్యక్తి నమిత్ శర్మ, ఖాళీ కార్ట్రిడ్జ్ కేసులు పట్టుకున్న సిల్వేరి శరత్ కుమార్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. వారి నుండి పాయింట్ 32 క్యాలిబర్ రివాల్వర్ (జర్మనీలో తయారు చేయబడింది) తో పాటు, ఖాళీ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకుని, ఫోరెన్సిక్ పరీక్ష నిమిత్తం తుపాకీ కాల్పుల అవశేషాల నమూనాలను కూడా సేకరించినట్లు చెప్పారు.
సోదాల సమయంలో, నిందితుడు సిల్వరి శరత్ కుమార్ నుండి 0.26 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మాదకద్రవ్యాన్ని కౌశిక్ రవి ద్వారా సేకరించినట్లు అతను అంగీకరించినట్లు చెప్పారు. నిందితుల్లో 11 మంది వ్యక్తులకు మాదకద్రవ్యాల నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వారిలో ఆరుగురికి పాజిటివ్ వచ్చిందన్నారు. ఫామ్‌హౌస్ నుంచి భారీ మొత్తంలో మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.