Reading Time: < 1 minute

 మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణల నేపథ్యంలో తాండూరు మాజీ ఎంఎల్‌ఎ పైలట్ రోహిత్ రెడ్డిపై భారత రాష్ట్ర సమితి చర్యలకు ఉపక్రమించింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన పార్టీ అధిష్ఠానం మంగళవారం ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం బిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణా వ్యవహారాల బాధ్యులు సోమా భరత్ కుమార్ నోటీసు ఇచ్చారు. ఈ అంశం విస్తృతంగా మీడియాలో ప్రచారం పొందడం వల్ల పార్టీ ప్రతిష్ఠకు, ప్రజల్లో ఆందోళనకు దారితీసిందని నోటీసులో పేర్కొన్నారు.

నైతిక విలువలకు కట్టుబడి ఉన్నాం : భారత రాష్ట్ర సమితి పార్టీ ఒక బాధ్యతాయుతమైన రాజకీయ సంస్థగా చట్టపరమైన నిబంధనలు, నైతిక విలువలను పాటించడంలో కట్టుబడి ఉందని సోమా భరత్ కుమార్ తెలిపారు. అక్రమ కార్యకలాపాలు, ముఖ్యంగా మాదక ద్రవ్యాల వినియోగం లేదా వాటితో ఏ విధమైన సంబంధం కలిగి ఉండటాన్నిపార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. రోహిత్ రెడ్డి ప్రమేయంపై వచ్చిన ఆరోపణలు పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉండటంతో ఈ విషయాన్ని పార్టీ అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ అధినేత కెసిఆర్ ఆదేశాల మేరకు షోకాజ్ నోటీసు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. నోటీసు అందిన తేదీ నుంచి 7 రోజుల్లోపు స్పష్టమైన,సమగ్ర లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని రోహిత్ రెడ్డిని ఆదేశించారు.

నోటీసు లేకుండానే తగిన క్రమశిక్షణా చర్యలు : ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలు, అధికారిక కార్యకలాపాల్లో రోహిత్‌రెడ్డి పాల్గొనకుండా ఉండాలని కూడా ఆదేశాలు ఇచ్చామని భరత్ కుమార్ పేర్కొన్నారు. నోటీసుకు గడువులోగా సంతృప్తికరమైన వివరణ సమర్పించకపోతే పార్టీ రాజ్యాంగం, నియమావళి ప్రకారం ఎటువంటి అదనపు నోటీసు లేకుండానే తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.