Reading Time: < 1 minute

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ గతంలో చేసిన రాజకీయ ప్రయత్నాలను డీఎంకే అడ్డుకుందని, ఆయనను బెదిరించిందని నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీ ఆదవ్ అర్జున ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన ఆరోపణలపై డీఎంకేతో పాటు రజనీకాంత్ అభిమానులు తీవ్రంగా మండిపడ్డారు. మరికొద్ది రోజుల్లో తమిళనాడు ఎన్నికలు జరగునున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై రజనీకాంత్ తాజాగా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో స్పందించారు.

ఆయన వ్యాఖ్యలు సత్యదూరం అని, కాలమే ఇలాంటి వాటికి సమాదానం చెబుతుందనారు. ‘టీవీకే పార్టీ నేతగా ఉన్న ఆదవ్ ఆర్జున ఇటీవల నాపై ఒక ప్రకటన చేశారు. అయితే ఆ ప్రకటన పూర్తిగా సత్యదూరం, అవాస్తవం. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ నాకు మద్దతుగా నిలిచిన తమిళనాడు విపక్ష నేత ఎడప్పాడి కె.పళనిస్వామి, బీజేపీ అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్, కేంద్ర మంత్రి ఎల్.మురుగున్, మీడియా మిత్రులు, నా అభిమాన దేవుళ్లకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కాలం మాట్లాడకపోవచ్చు, కానీ సరైన సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది అని పేర్కొన్నారు.