
అఫ్ఘనిస్తాన్‌పై పాక్ వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. అత్యంత అమానుష ఘటనగా అభివర్ణించింది. ఇది పిరికిపంద చర్య అని మండిపడింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ మంగళవారంనాడు ఒక ప్రకటన విడుదల చేసింది. పాకిస్థాన్ జరిపిన వాయుదాడిని భారత్ నిర్ద్వంద్వంగా ఖండిస్తోందని అందులో పేర్కొంది. ‘ఇది పిరికిపంద చర్య. దుర్మార్గమైన హింసాత్మక చర్య. భారీ సంఖ్యలో పౌరులు మరణించారు. ఈ మారణహోమాన్ని సైనిక ఆపరేషన్‌గా కప్పిపుచ్చుకునేందుకు పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నం ఎంతమాత్రం సమర్ధనీయం కాదు. ఇది ఒక దేశ సార్వభౌమాధికారంపై జరిగిన దాడి. ఇలాంటి చర్యల వల్ల ప్రాంతీయ అస్థిరతకు ముప్పు వాటిల్లుతుంది. దేశ అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సరిహద్దుకు ఆవల దాడులకు దిగడం
పాకిస్థాన్ బాధ్యతారాహిత్యాన్ని, నిర్లక్ష్యాన్ని చాటుతుంది’ అని విదేశాంగ శాఖ ప్రకటనలో తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో ఈ దాడులకు పాల్పడటం మరింత దారుణమని, నమ్మకాలు, చట్టాలు, నైతికత లేకుండా ఆసుపత్రులు, రోగులపై దాడి చేశారని విమర్శించింది. ఇలాంటి దాడులకు పాల్పడేవారిని అంతర్జాతీయ సమాజం జవాబుదారీగా చేయాలని భారత్ సూచించింది. మృతులు, వారి కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నామని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని పేర్కొంది. ఈ విషాద సమయంలో అఫ్ఘాన్ ప్రజలకు సంఘీభావం తెలియజేస్తున్నామని, ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని విదేశాంగ శాఖ ప్రకటించింది.