Reading Time: < 1 minute

కర్ణాటక, తమిళనాడు మీదుగా కొరిమన్ ప్రాంతం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురువడంతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మార్చి మొదటి వారం నుంచి విపరీతమయిన ఎండ, ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరయిన ప్రజలు వర్షం వాతావరణం చల్లబడడంతో కాస్త ఉపశమనం కలిగింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం సైతం రాష్ట్రంలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.

హైదరాబాద్ నగరంలో సైతం పలు ప్రాంతాల్లో వరుణుడు పలుకరించడంతో వాతావరణం చల్లబడింది. ద్రోణి ప్రభావంతో వర్షం కంటే అధికంగా గంటకు సుమారు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో బుధవారం అన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అన్ని జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటు ఉరుములు, మెరుపులు ఈదురు గాలులు వీస్తాయని, రైతులు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.