
ముంబై: అతి చిన్న వయసులోనే అసాధారణ బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన భవిష్యత్తు ప్రణాళికలు ఏంటో అభిమానులతో పంచుకున్నాడు. బిసిసిఐ నమన్ అవార్డుల కార్యక్రమంలో ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యత హర్షా భోగ్లేతో వైభవ్ ముచ్చటించాడు. ఈ క్రమంలో తన కెరీర్‌కు సంబంధించి పలు విషయాలను వెల్లడించాడు. ప్రస్తుతం తన దృష్టంతా ఆటపైనే ఉందన్నాడు. బయట జరిగే చర్చ గురించి అసలు పట్టించుకోనని స్పష్టం చేశాడు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగడమే లక్షంగా పెట్టుకున్నట్టు తెలిపాడు. రానున్న రోజుల్లో టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదగాలనేది ప్రధాన ఆశయమన్నాడు. అవకాశం లభిస్తే సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నానన్నాడు. భవిష్యత్తులో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న 175 పరుగుల రికార్డును బద్దలు కొట్టడమే లక్షంగా పెట్టుకున్నట్టు వివరించాడు. టి20 ఫార్మాట్‌లో గేల్ నమోదు చేసిన అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు తిరగరాసేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు. రానున్న ఐపిఎల్‌లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు. ప్రతి మ్యాచ్‌లో జట్టుకు అండగా నిలువడమే లక్షంగా పెట్టుకున్నానని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు సర్వం ఒడ్డుతానని వైభవ్ స్పష్టం చేశాడు.