Reading Time: 2 minutes

ఈ దేశంలో జరుగుతున్న చాలా ప్రేమ వివాహాలు కులాంతర వివాహాలే. ప్రేమికులలో ఒకరు దళితులైతే జరిగే పరిణామాలేమిటో రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంచెం తక్కువగా, ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా వార్తల రూపంలో గమనిస్తూనే ఉన్నాం. కులం పేరుతో మనుషులను చంపడానికి సైతం వెనుకడుగు వేయటం లేదంటే ఈ కులం ఎంత ప్రమాదకర స్థాయిలో మనిషిని నడిపిస్తున్నదో అర్థమవుతుంది. ఇది శాస్త్ర సాంకేతికత తెచ్చిన విప్లవాల యుగం. ఇప్పుడే ఇలా ఉంటే అంబేద్కర్ కాలంలో, కుసుమ ధర్మన్న లాంటి కవులు జీవించిన 1884-1946 మధ్యకాలంలో కులం ఎంత క్రూరంగా కోరలు సాచి ఉంటుందో ఊహించటం కష్టం కాదు. కుసుమ ధర్మన్న ఆనాటి దళిత జీవితంలోని సకల అంశాలను తన సాహిత్యంలో ప్రతిభావంతంగా రికార్డు చేశాడు. ఆయన కాలం నాటి కవులందరు అగ్రవర్ణాల వాళ్లే. ఆనాటికి దళితుల్లో చదువుకున్నవాళ్ళు తక్కువ. కిందికులాలు చదువుకోకూడదనే శాసనాలు ఆనాటికింకా సడలిపోలేదు. ఎలాగోలా కష్టపడి చదువుకున్నప్పటికీ కులంపోటులు మాత్రం తప్పేవికావు. అందుకే అగ్రవర్ణాల వాళ్ళ కవిత్వానికి, దళితుడైన ధర్మన్న కవిత్వానికి చాలా వ్యత్యాసం కన్పిస్తుంది. వాళ్ళ రచనల్లో ఎక్కడా కనిపించని జీవితం ధర్మన్నలో కనిపిస్తుంది.

పాండిత్య ప్రదర్శన కోసం రాసిన కవిత్వం కాదు కాబట్టి భాష కూడా సరళంగా ఉంటుంది. బాధలో ఉన్నవాడు తన భాషలో మాట్లాడుతాడు, కానీ పండిత భాషలో మాట్లాడడు. అందుకే ధర్మన్న గేయం రాసినా, పద్యం రాసినా ఇంకొకటి రాసినా ఆనాడు ప్రచారంలో ఉన్న గ్రాంథిక భాషలో కాకుండా సామాన్యుల భాషలోనే రాశాడు. ఇదికూడా ఆనాటికొక విప్లవమే. కుసుమ ధర్మన్న తెలుగులో తొట్టతొలి దళితకవి. అంతకుముందు దళిత జీవితాలలోని దైన్యానికి చలించిన కొందరు అగ్రవర్ణాలవాళ్ళు సానుభూతితో కూడిన రచనలు చేశారు. కానీ ఎవరి నొప్పిని వారు చెప్తేనే స్పష్టత వస్తుంది. ఈ క్రమంలో ధర్మన్న, జాషువా లాంటివాళ్ళు ముందుకువచ్చి కులరక్కసి దళిత జీవితాలను ఎలా పీల్చిపిప్పి చేస్తుందో చెప్పేదాకా దాని తాలూకు చర్చ సాహిత్య సాంస్కృతికరంగాలలో పెద్దగా లేదు. తెలంగాణ కేంద్రంగా అప్పటికే తీవ్రమైన దళితోద్యమాన్ని నడిపిస్తున్నాడు భాగ్యరెడ్డి వర్మ. దేశం మొత్తమ్మీద అంబేద్కర్ దళితుల హక్కుల కోసం, రాజకీయంగా దక్కవల్సిన ప్రాతినిధ్యం కోసం గంభీరమైన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు.

ఈ ఉద్యమాల ప్రభావం కుసుమ ధర్మన్న మీద ఉంది. అంబేద్కర్‌తో సహా అప్పటి దళితోద్యమకారులందరినీ కలిసి విస్తృతంగా చర్చలు చేపట్టి తన గమ్యాన్ని, గమనాన్ని స్పష్టంగా నిర్వచించుకున్నవాడాయన. ఈ క్రమంలో ధర్మన్నను అర్థం చేసుకోవడంలో కేవలం సాహిత్య రంగానికి మాత్రమే పరిమితం కాకూడదు. సామాజికంగా ఆయన సాగించిన ఉద్యమాలు, ఇతర రంగాలలో ఆయన చేసిన సేవలు విస్తృతమైన ప్రాధాన్యాన్ని కలిగి ఉన్నాయి. ఇవన్నింటి ఫలితంగా సాగిన కృషి ఆయన సాహిత్యరంగాన్ని బలోపేతం చేసింది. 1921లో ‘మాకొద్దీ తెల్లదొరతనమూ’ అంటూ గరిమెళ్ళ సత్యనారాయణ రచించిన ప్రసిద్ధ గేయం అందరికీ తెలుసు. అదే సంవత్సరంలో కుసుమ ధర్మన్న‘మాకొద్దీ నల్లదొరతనమూ’ అనే గేయాన్ని రాసి తెల్లదొరల నుంచి స్వాతంత్య్రం నల్లదొరల చేతిలోకి వెళ్లినంత మాత్రాన దళితుల జీవితాల్లో ఏ మార్పు ఉండదని నిర్ద్వంద్వంగా ప్రకటించాడు. ఇదే కాలంలో రాజకీయరంగంలో అంబేద్కర్ ఇదే ప్రధాన విషయంగా పోరాటం చేస్తున్నాడు. అంబేద్కర్ ఆలోచన సాహిత్యంలో కుసుమ ధర్మన్న ద్వారా ఇలా ప్రతిఫలించింది. ఈయన సాహిత్య జీవితంలో ప్రధానమైన రచన ఇది. దళితునిగా ఆయన వేదననంతా అత్యంత మర్యాద పూర్వక గొంతుతో వినిపించాడిందులో. ‘మీ తల్లిదండ్రులు మిమ్ము గన్నట్టూల/ మా వారు మమ్మూ గనలేద?/

మీకు మాకు పుట్టుక వకటే కాద?/రక్తమాంసాలు ఒకటి గాద?/కష్ట సుఖము మీకె మాకు లేద?/మీకు మాకు దేవుడొకడు గాడ?/మతము మీకు మాకు ఒకటి గాద?/యీ వాదా భేదమేల యిది మీకు మర్యాద?’ అన్న ప్రశ్నలు ఆనాటి కాలానికి ఎంతో విప్లవాత్మకమైనవి. దళితునిగా తాను, తన సమాజం అనుభవించిన వివక్ష తాలూకు ప్రస్తావన, అభ్యర్థన పూర్వకమైన గొంతు ‘మా కొద్దీ నల్లదొరతనం’లో కనిపిస్తే 1933లో వచ్చిన ‘హరిజన శతకం’లో ఆయన స్వరంలో కొంచెం తీవ్రత కనిపిస్తుంది. ఆలోచనల్లో తాత్విక గాఢతతోపాటు సిద్ధాంతబలం కూడా తోడయ్యింది. ఉద్యమాలతో కలిసిపోవడం వల్ల కనిపించిన చేర్పు ఇది. అందుకే హరిజన శతకానికి రాసిన హెచ్చరికలో-‘ప్రియ హరిజన సోదరా! నీవు హీనజాతి వాడివా? బానిసవా? పరులకు దాస్యము జేయుటకు భగవంతుడే నిన్నిట్లు విధించినాడా? ఆహా! ఏమి యీ నిరంకుశత్వము? స్వార్థపరుడైన నరుడే నీకీ విషయము ఉగ్గుపాలతోబోసి. మోసపుచ్చి. నిన్ను తన దాసానుదాసునిగా జేసికొని బంధించి యున్నాడని నేటికైనను గ్రహించితివా?’ అని ఆలోచించమని చెప్పగలిగాడు.

కులం వెనకున్న రాజకీయాల గురించి మాట్లాడగలిగాడు. గాంధీ ప్రభావంతో హరిజన శతకం రాశాడు కానీ తదనంతరం కాలంలో ఆ పదాన్ని వ్యతిరేకించాడు. ఇవేకాక ‘అసుర పురాణం’, ‘అంటరాని వాళ్ళా?’ మొదలైన రచనలు కూడా దళిత దృష్టికోణం నుంచే రచించాడు. తన సంపాదకత్వంలో నడిపించిన ‘జయభేరి’ పత్రికను కూడా దళితోద్యమ ప్రచారానికే వాడుకున్నాడు. ఇన్ని రకాలుగా తన కాలంనాటికి దళిత స్వరాన్ని ఇంత బలంగా వినిపించిన మరొకకవి తెలుగులో లేరు. వందేళ్ల కిందటివే అయినప్పటికీ ఆయన రచనలకు కాలదోషం పట్టలేదు. భారత సామాజిక నిర్మాణంలో కులం పోనంత కాలం, కుల దాష్టీకాలు సమసిపోనంత కాలం కుసుమ ధర్మన్న రచనల ఆవశ్యకత నిలిచే ఉంటుంది.

తోకల రాజేశం 96767 61415

– నేడు కుసుమ ధర్మన్న జయంతి