
డగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని అరెస్టు చేసిన సందర్భంగా ఆయనకు బిఆర్ఎస్ పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. మొయినాబాద్ లో జరిగిన ఒక సమావేశంలో మాదకద్రవ్యాల వినియోగం జరిగినట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, అప్పటి వరకు పార్టీ కార్యకలాపాలకు హాజరు కావొద్దని నిర్ణయం తీసుకోవడంతో పాటు రోహత్ పై సస్పెన్షన్ విధించారు. క్రమశిక్షణ విషయంలో రాజీ పడేది లేదని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. భారత రాష్ట్ర సమితి పార్టీ ఒక బాధ్యతాయుతమైన రాజకీయ సంస్థగా చట్టపరమైన నిబంధనలు, నైతిక విలువలు పాటించడంలో విజ్ఞానం కలిగి ఉందని చెప్పింది. అక్రమ కార్యకలాపాలు, ముఖ్యంగా మాదకద్రవ్యాల లేదా మత్తు పదార్థాల వినియోగం లేదా వాటితో ఏవిధమైన సంబంధం కలిగి ఉండడాన్ని పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని తెలిపింది.
పై సంఘటనలో రోహిత్ హాజరు, ప్రమేయం ఉందనే ఆరోపణలు పార్టీకి తీవ్రమైన అపకీర్తిని తెచ్చి పెట్టడమే కాకుండా పార్టీ ప్రతిష్ట, విశ్వనీయతకు భంగం కలిగించే అవకాశం కలిగించాయని వివరించింది. పై విషయాలను దృష్టిలో ఉంచుకొని, బిఆర్ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్ ఆదేశం మేరకు ఈ నోటీసులు జారీ చేయడం జరిగింది వెల్లడించింది. ఇవాళ్టి నుంచి 7 రోజులలోపు మీడియా ద్వారా వచ్చిన ఆరోపణలపై జవాబు స్పష్టంగా వివరిస్తూ సమగ్రంగా లిఖిత పూర్వక వివరణ సమర్పించవలసిందిగా రోహిత్ కు ఈ నోటీసు ద్వారా ఆదేశిస్తున్నామని పార్టీ నాయకత్వం పేర్కొంది.