Reading Time: < 1 minute

జగిత్యాల: ప్రేమ పెళ్లి చేసుకున్నాడు… నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యను భర్త కత్తితో పొడిచి చంపాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కోరుట్లకు చెందిన చిత్తరి హరిబాబు, మాదాపూర్‌కు చెందిన వైష్ణవి అనే యువతి యువకుడు గాఢంగా ప్రేమించుకున్నారు.  గత నవంబర్ నెలలో ప్రేమ జంట ప్రేమ పెళ్లి చేసుకుంది. హరిబాబు ప్రభుత్వ ఆస్పత్రిలో ఒప్పంద కార్మికుడిగా పని చేస్తూ మాదాపూర్‌లో నివసిస్తున్నారు. వైషు అమ్మ పేరుతో యూట్యూబ్‌లో రీల్స్ చేస్తూ ఛానల్‌ను నిర్వహిస్తోంది. ఆమె ఛానల్ కు దాదాపుగా 50 వేల మంది సబ్ స్ర్కైబర్స్ ఉన్నారు. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియోలు, షార్ట్స్ పోస్టు చేశారు. షార్ట్స్ కు మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. గత కొన్ని రోజుల నుంచి ఇద్దరు మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున వైష్ణవిని హరిబాబు కత్తితో పొడిచి హత్య చేసి పారిపోయాడు. కుటుంబ సభ్యులు చూసేసరికి వైష్ణవి రక్తపు మడుగులో కనిపించింది. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హరిబాబు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆమె మృతిపట్ల అభిమానులు సంతాపం తెలిపారు.