Reading Time: 3 minutes

ప్రధాని నరేంద్ర మోడీ, ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యపై ఇప్పటివరకు బహిరంగంగా స్పందించకపోవడం దేశంలో పెద్ద చర్చ కు దారితీసింది. డొనాల్డ్ ట్రంప్, బెంజమిన్ నెతన్యాహు సంయుక్తంగా నిర్వహించిన అమెరికా, ఇజ్రాయెల్ సైనిక దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు గురయ్యారని వార్తలు వచ్చిన తరువాత మోడీ మౌనం పాటించడం దేశీయంగా, అంతర్జాతీయంగా కొన్ని విమర్శలు వచ్చిన మాట నిజమే. ప్రతిపక్ష నేతలు దీన్ని నైతిక బాధ్యతలను వదిలిపెట్టడంగా వ్యాఖ్యానిస్తున్నారు. సమీపంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ముఖ్యంగా ముస్లిం ఓటర్లు కీలక పాత్ర పోషించే ప్రాంతాల్లో, ఈ విషయం రాజకీయ వివాదంగా మారింది. అయితే చాలామంది తెలివైనవారు కూడా.. ఖమేనీ హత్యపై మాత్రమే దృష్టిని పెట్టి, దానికి ప్రతిగా ఇరాన్ చేసిన చర్యలు అరబ్ దేశాలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో మాత్రం పెద్దగా గమనించడం లేదు.

మోడీ తన అభిప్రాయాన్ని తరువాత వెల్లడించే అవకాశముంది. కానీ ప్రస్తుతం ఆయన మౌనం పాటించడం వెనుక రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని చెప్పవచ్చు. మొదటిది.. గల్ఫ్ అరబ్ దేశాలతో భారతదేశానికి ఉన్న వ్యూహాత్మక సంబంధాలు, ఇరాన్ ప్రతి దాడి కారణంగా ఇప్పుడు ఆ దేశాలే ప్రధాన లక్ష్యాలుగా మారాయి. రెండవది.. భారత దేశంలోని ముస్లిం జనాభాలోని మతపరమైన విభజనలు కూడా మరో కారణం. ఖమేనీ హత్య వార్త ప్రపంచానికి చేరకముందే, ఇరాన్ తన ఆగ్రహాన్ని అరబ్ దేశాలపై చూపించడం ప్రారంభించింది. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవాలని ప్రకటించినప్పటికీ, అనేక మిసైళ్లు, డ్రోన్లు సాధారణ పౌర ప్రాంతాలను కూడా తాకాయి. పోర్టులు, విమానాశ్రయాలు, ఆయిల్ టెర్మినల్స్, హోటళ్లు, పర్యాటక రిసార్ట్ వంటి గల్ఫ్ దేశాల ప్రధాన ఆర్థిక వనరులపై దాడులు జరిగాయి.

ఇరాన్ ప్రతిదాడులు కేవలం ఇజ్రాయెల్‌కే పరిమితం కాలేదు. గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ సభ్యదేశాలు, జోర్డాన్, అలాగే ఇరాక్‌లోని కుర్దిష్ స్వయంప్రతిపత్తి ప్రాంతం కూడా లక్ష్యాలయ్యాయి. సుదీర్ఘ కాలంగా తటస్థ విధానాన్ని అనుసరిస్తున్న ఒమన్ కూడా ఈ దాడుల నుండి తప్పించుకోలేదు. ఇరాన్‌తో మంచి సంబంధాలు కలిగిన ఖతార్ కూడా దాడులకు గురైంది. ఇప్పటివరకు ఇలాంటి మిసైల్ దాడులకు అలవాటుపడింది ప్రధానంగా ఇజ్రాయెల్ మాత్రమే. కానీ సంపద, భద్రతలతో జీవిస్తున్న గల్ఫ్ దేశాలకు ఈ దాడులు తీవ్రమైన షాక్‌గా మారాయి. ట్రంప్-నెతన్యాహు చర్యలవల్ల ఈ యుద్ధం ప్రారంభమైనా, ఇరాన్ ప్రతిస్పందన భారతదేశానికి అత్యంత కీలకమైన ప్రాంతాన్ని అస్థిరం చేస్తోంది. మోడీ ఖమేనీ హత్యపై సంతాపం ప్రకటించి ఉండవచ్చు. కానీ గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న సుమారు ఒక కోటి భారతీయుల భద్రతను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం కూడా భారత్ ప్రధాన మంత్రిగా మోడీపై బాధ్యత ఉంది.

ఈ సందర్భంలో ఇరాన్‌కు మద్దతుగా మోడీ ఏ వ్యాఖ్య చేసినా గల్ఫ్ అరబ్ నాయకులతో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. ఈ దేశాలు భారతదేశానికి రాజకీయంగా, ఆర్థికంగా ముఖ్యంగా ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైనవి. అందుకే ఇరాన్ దాడులు జరిగిన కొద్ది గంటల్లోనే మోడీ, షేఖ్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నేతృత్వంలోని యుఎఇ నాయకత్వంతో మాట్లాడి దాడులను ఖండించారు. అలాగే మొహమ్మద్ బిన్ సల్మాన్ తో మాట్లాడి సౌదీ అరేబియాపై జరిగిన దాడులను కూడా ఖండించారు. తరువాత బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, జోర్డాన్ నాయకులతో కూడా మాట్లాడి భారతదేశం మద్దతు ప్రకటించారు. అయితే అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై ఆయన స్పందన మాత్రం భిన్నంగా కనిపించింది.

ఇక్కడ మరో చారిత్రక అనుభవాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. 1990లో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ కువైట్‌పై దాడి చేసినప్పుడు, పాలస్తీనా నాయకుడు యాసర్ అరాఫత్ అతనికి మద్దతు ఇచ్చాడు. 1991లో కువైట్ విముక్తి పొందిన తరువాత గల్ఫ్‌దేశాలు సుమారు నాలుగు లక్షల పాలస్తీనీయులను అక్కడి నుండి పంపివేశాయి. ఆ నిర్ణయం పాలస్తీనా సమస్యను అరబ్ రాజకీయాల్లో బలహీనపరిచింది. తరువాత అనేక దేశాలు, భారతదేశం సహా ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణం చేసుకున్నాయి. అలాగే 1990లో అప్పటి భారత విదేశాంగ మంత్రి ఐ.కె. గుజ్రాల్ సద్దాం హుస్సేన్‌ను ఆలింగనం చేసుకున్న ఘటన కూడా అరబ్ దేశాల్లో అసంతృప్తికి దారితీసింది. తరువాత ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు గల్ఫ్ దేశాలు ఆయనను ఆహ్వానించడానికి కూడా ఇష్టపడలేదు.

ఇంకొక అంశం భారతదేశంలో మతపరమైన విభజనలు. తాజా అంచనాల ప్రకారం, ఇరాన్, పాకిస్తాన్, ఇరాక్ తరువాత ప్రపంచంలో నాలుగో పెద్ద షియా జనాభా భారత దేశంలో ఉంది. సుమారు రెండు కోట్లమంది షియా ముస్లింలు ఉన్నారు. ఖమేనీ షియా ముస్లింలకు గౌరవనీయ నాయకుడు. అయితే ఇస్లామిక్ ప్రపంచం ఒకే స్వరంతో మాట్లాడదు. ఇజ్రాయెల్ విషయంలో కూడా అనేక దేశాలకు వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి.గల్ఫ్ ప్రాంతంలోని సున్నీ దేశాలపై ఇరాన్ దాడులు షియా-సున్నీ విభేదాలను మళ్లీ ప్రేరేపించే అవకాశం ఉంది. ఖమేనీ మరణంపై ముస్లింలందరూ సంతాపం వ్యక్తం చేసినా, ఆయనను షియా మతంలోని నాల్గవ ఇమామ్ అయిన అలీలా మార్త్యుడుగా భావించడం చాలా మంది సున్నీ ముస్లింలకు అంగీకారయోగ్యం కాదు. ఈ నేపధ్యంలో ఖమేనీకి మద్దతుగా జరిగే ర్యాలీలపై భారత హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన సూచనలను అర్థం చేసుకోవాలి.

ఇరాన్ దాడులు, అలాగే మతపరమైన విభజనలు ఉన్న ఈ పరిస్థితిలో భారత ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. గల్ఫ్ దేశాలు కోపంతో విదేశీ కార్మికులను పంపిస్తే, భారతదేశం వంటి కార్మికులను పంపే దేశాలు భారీగా తిరిగి వచ్చే వలసదారులను ఎదుర్కోవాల్సి వస్తుంది. విదేశాంగ విధానం భావోద్వేగాలపై ఆధారపడదు. ఖమేనీని ప్రశంసించినవారైనా, గల్ఫ్ దేశాలతో మంచి సంబంధాలు కొనసాగించడం భారతదేశానికి ఎంత అవసరమో గుర్తించాలి. ప్రస్తుతం గల్ఫ్ దేశాల భద్రత, స్థిరత్వం భారతదేశానికి అత్యంత ముఖ్యమైనవి. ఎందుకంటే ఖమేనీ గతంలో కశ్మీర్ సమస్యపై, భారత ముస్లింల పరిస్థితిపై భారత్‌ను విమర్శించిన సందర్భాలు ఉన్నాయి.

రాజకీయ నాయకులు, విదేశాంగ నిపుణులు, మేధావులు ఈ విషయంపై ఎన్నో చర్చలు, విమర్శలు చేయవచ్చు. కానీ ప్రభుత్వానికి మాత్రం భావోద్వేగాల కంటే కూడా దేశప్రయోజనాలు ముఖ్యం. ఇరాన్ సార్వభౌమత్వం ముఖ్యమా లేక అరబ్ దేశాల భద్రత ముఖ్యమా అనే నైతిక చర్చలు చేయడం సులభమే. కానీ ప్రభుత్వాలను పాలించే నేతలకు అలాంటి సౌకర్యం ఉండదు. భారతదేశం ఇరాన్‌కు మద్దతు ఇచ్చిందని భావించి గల్ఫ్ దేశాలు అక్కడ ఉన్న సుమారు కొటి మంది భారతీయులను వెనక్కి పంపివేస్తే అదే విమర్శకులు మళ్లీ ప్రభుత్వాన్ని ఈ విపక్షాలు తప్పుబడతాయి. గల్ఫ్ దేశాలలో ఉన్న ఒక కోటి భారతీయుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటే, ప్రభుత్వం మాట్లాడే ప్రతి మాటను వెయ్యిసార్లు ఆలోచించి చెప్పాల్సి ఉంటుంది. ఒక భావోద్వేగ వ్యాఖ్య కూడా వారి జీవితాలను పూర్తిగా తారుమారు చేసే ప్రమాదం లేకపోలేదు.

– కోలాహలం రామ్‌కిశోర్

98493 28496