
ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ పోరు కీలక మలుపు తిరిగింది. ట్రంప్ , నెతన్యాహులు ఇప్పుడు ఇరాన్ అత్యంత కీలకమైన చమురు వనరులపై పట్టుకు సైనిక వ్యూహాలకు దిగుతున్నారు. ఇరాన్‌కు చమురు వ్యాపారం, ఉత్పత్తి కేంద్రం అయిన ఖర్గ్ దీవిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికా స్వాధీనం చేసుకునేలా సైనిక వ్యూహాలు సిద్ధం చేయాలని తమ సైనిక సలహాదారులకు ట్రంప్ సూచించారు. ఇటీవల ఖర్గ్ దీవిపై అమెరికా విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. దాడుల సమయంలో అక్కడి వైమానిక, సైనిక స్థావరాలను లక్షంగా చేసుకున్న అమెరికా చమురు క్షేత్రాల జోలికి వెళ్లలేదు. అయితే ఈ చమురు దీవి ఇరాన్‌కు ప్రముఖమైన వ్యాపార కేంద్రం అనే విషయాన్ని గుర్తించిన ట్రంప్ ఇప్పుడు వచ్చే కొద్దిరోజుల్లోనే ఈ దీవిని ఇక్కడి చమురు క్షేత్రాలతో పాటు స్వాదీనం చేసుకుని, తద్వారా ఇరాన్‌కు ఆర్థిక నష్టం కల్గించాలని సంకల్పించారు. ఇదే సమయంలో ఇరాన్ ప్రపంచ స్థాయిలో ఇంధన మార్కెట్‌ను నిశ్చేష్టపరుస్తూ హర్మూజ్ జలసంధి మీదుగా చమురు నౌకల కదలికలను అడ్డుకుంది.
దీనితో అంతర్జాతీయంగా బ్యారెల్ ముడిచమురు ధరలు వంద డాలర్లు మించి పోయాయి. పలు దేశాలలో ఎల్‌పిజి, పెట్రోలు డీజిల్, ప్రత్యేకించి కమర్షియల్ గ్యాస్ ధరలు పెరిగాయి. ఇరాన్ చమురు దెబ్బతోనే ఇజ్రాయెల్, అమెరికాపై ప్రపంచవ్యాప్త తీవ్ర నిరసనలు వెలువడేలా చేస్తోంది. ఈ క్రమంలోనే తనకు మిత్రదేశాలని పేర్కొంటూ భారత్ వంటి అతి కొద్ది దేశాలకు చమురు రవాణాకు మార్గం కల్పించింది. మరో వైపు గల్ఫ్ దేశాలు అమెరికాకు సైనిక స్థావరాలు కావడంతోనే తమ దేశానికి కీడు జరిగిందని, ప్రత్యేకించి అరబ్ దేశాలలోని యుఎస్ సైనిక కేంద్రాల బలంతోనే అమెరికా అధ్యక్షుడు రెచ్చిపోయాడని గ్రహించింది. దీనితో గత కొద్దిరోజులుగా ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్‌పై తన వద్ద ఉన్న అత్యంత అధునాతన క్షిపణులను ప్రయోగిస్తోంది. మరోవైపు గల్ఫ్‌లోని అమెరికా స్థాదరాలతో పాటు కొన్ని దేశాల ఇతరత్రా వ్యాపార వాణిజ్య కేంద్రాలను కూడా లక్షంగా ఎంచుకుని దాడులకు దిగింది.