Reading Time: < 1 minute

రాష్ట్రంలోని ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన రైతులకు సచివాలయంలో మంగళవారం వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు ఫార్మర్ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వ్యవసాయ శాఖ సంచాలకు గోపి సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 61,125 మంది రైతులను 489 క్లస్టర్లలో, ప్రతి క్లస్టర్ కు 125 మంది చొప్పున జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంలో ఎంపిక చేస్తామన్నారు. సేంద్రియ వ్యవసాయం పై ప్రత్యేక శిక్షణ ఇచ్చి, సేంద్రియ వ్యవసాయం వైపు ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పథకంలో భాగంగా కృషి సఖిలను క్లస్టర్ కు ఇద్దరు చొప్పున ఎంపిక చేసి వారికి శిక్షణను ఇచ్చి వారి ద్వారా క్లస్టర్లో 125 మంది రైతులకు సేంద్రీయ సాగు పద్ధతులపై నిరంతరం అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.

ప్రకృతి వ్యవసాయం చేసిన రైతులకు సర్టిఫికేషన్, ప్రోత్సాహం అందించడం, జీవ ద్రావణాలు తయారు చేసే కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 489 క్లస్టర్లలో, ప్రతి క్లస్టర్‌కు 125 మంది చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 61,125 మంది రైతులకు ఈ కిట్లను అందజేస్తామన్నారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన, గుర్తింపు కోసం ఈ కిట్‌లో క్లాత్ బ్యాగ్, క్షేత్ర దర్శిని డైరీ, గుర్తింపు కార్డు, ప్రత్యేక క్యాలెండర్, టోపీ, పెన్ను, చిన్న ప్యాకెట్ డైరీ వంటి వస్తువులు ఉంటాయని వివరించారు. సచివాలయంలో మంత్రి ప్రారంభించిన అనంతరం, ఆయా జిల్లాల్లోని రైతు వేదికలలో స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా రైతులకు ఈ కిట్లను పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.