Reading Time: < 1 minute

ఎపిలో సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలో మహిళపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో రాజమండ్రి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నర్సరీలో పనిచేసే మహిళపై అత్యాచారాయత్నానికి పాల్పడి, ఆపై హత్య చేసిన నలుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసు 2024 అక్టోబర్‌లో చోటు చేసుకుని ఎపి వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. జిల్లా కోర్టు న్యాయమూర్తి నిందితులపై ఉన్న ఆధారాలు, పోలీసుల దర్యాప్తు నివేదికలను పరిశీలించిన అనంతరం ఈ సంచలన తీర్పును ప్రకటించారు. నిందితులు అందరూ 19 ఏళ్ల నుంచి 26 సంవత్సరాల మధ్య యువకులని పోలీసులు వెల్లడించారు.

ఈ దారుణ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని కడియం మండలం బుర్రిలంక గ్రామ పరిధిలోని ఓ నర్సరీలో చోటు చేసుకుంది. అక్కడ పనిచేస్తున్న 43 ఏళ్ల మహిళపై నలుగురు యువకులు దారుణంగా అత్యాచారం చేసి అనంతరం హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మహిళ ప్రతిరోజు మాది రిగానే నర్సరీ పనులకు వెళ్లిన సమయంలో నిందితులు ఆమెపై దాడి చేసి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. అనంతరం తమ నేరాన్ని దాచేందుకు ఆమెను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మహిళల భద్రతపై కూడా పెద్ద చర్చ జరిగింది.