Reading Time: < 1 minute

 బిఆర్‌ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో సోమవారం ఘనంగా దావత్ -ఎ -ఇఫ్తార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పాల్గొని మైనారిటీ సోదర సోదరీమణులందరికీ పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని మైనారిటీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా కెటిఆర్ విమర్శించారు. మైనారిటీల సంక్షేమం కోసం ప్రకటించిన డిక్లరేషన్‌ను అమలు చేయకుండా వారిని మోసం చేశారన్నారు. కాంగ్రెస్ మైనారిటీలను ఏ విధంగా వంచించిందో శాసనసభ సమావేశాల్లో సాక్ష్యాధారాలతో సహా ఎండగడతామని చెప్పారు.

అపరిష్కృతంగా ఉన్న ప్రతి హామీ పైన ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా నిలదీస్తామని భరోసా ఇచ్చారు. పదేళ్ల కెసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం కుల మతాలకు అతీతంగా, గంగా-జమునా తెహజీబ్ సంస్కృతితో అద్భుతంగా ముందుకు సాగిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తూ మత సామరస్యానికి పెద్దపీట వేసిందని తెలిపారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఆ ఆశయాలను పక్కన పెట్టడం బాధాకరమని అన్నారు. ఇఫ్తార్ విందులో కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, మైనారిటీ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.