Reading Time: 2 minutes

సుప్రీంకోర్టు తీర్పుననుసరించి టాలీవుడ్ నటి ప్రత్యూష మృతి కేసులో దోషి సిద్ధార్థరెడ్డి నాంపల్లి కోర్టులో సోమ వారం లొంగిపోయాడు. సిద్ధార్థరెడ్డి అమెరికా నుంచి వచ్చి న్యాయస్థానంలో లొంగిపోయాడు. 2022 ఫిబ్రవరి 24న ప్రత్యూష మృతి చెందారు. కూల్ డ్రింకులో పురుగుల మందు కలుపుకుని ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి తాగారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యూష మృతి చెంద గా, సిద్ధార్థరెడ్డి కోలుకున్నాడు. ప్రత్యూషను ఆత్మహత్య చేసుకునేలా సిద్ధార్థరెడ్డి ప్రేరేపించాడని ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది. కాగా, ప్రత్యూ ష మృతి కేసులో ఇటీవల సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది. కేసులో నిందితుడు సిద్ధార్థరెడ్డి వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోవాలని న్యాయ స్థానం పేర్కొంది. బెయిల్ కోసం సిద్ధార్థరెడ్డి వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రత్యూష హత్య కేసులో సిద్ధార్థరెడ్డికి విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది.

సిబిఐ విచారణ తర్వాత సిద్ధార్థరెడ్డిపై 306 (ఆత్మహత్యకు పురికొల్పడం), 309 (ఆత్మహత్యకు యత్నించడం) సెక్షన్ల కింద చార్జిషీట్ వేసింది. దీంతో 2004లో హైదరాబాద్ మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి ఐదేళ్ల కఠిన కారాగారశిక్షను ఖరారు చేసింది. ఆపై రూ.5వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. అయితే తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థరెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే 2011లో జైలు శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ సిద్ధార్థరెడ్డికి అనుకూలంగా తీర్పు రావడంతో కాస్త ఊరట దక్కింది. సుప్రీంకోర్టు కూడా రెండేళ్ల జైలు శిక్ష సబబే అని తీర్పునిచ్చింది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థరెడ్డికి న్యాయస్థానం సూచించింది. తన కుమార్తె నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై సరోజినీ దేవి స్పందిస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నానని, కానీ తమకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని పేర్కొన్న సంగతి విదితమే.

ఘటన జరిగిందిలా..!

1993వ సంవత్సరంలో హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్‌లో ఓ కాలేజీలో ప్రత్యూష, సిద్ధార్థరెడ్డిలు ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రేమలో పడ్డారు. ఇంటర్ పూర్తయిన తర్వాత సిద్ధార్థరెడ్డి ఇంజినీరింగ్‌కు వెళ్లగా, ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లారు. ఇద్దరి వివాహానికి ప్రత్యూష తల్లి తొలుత వ్యతిరేకించినా తర్వాత అంగీకరించారు. సిద్ధార్థరెడ్డి తల్లి మాత్రం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించడం వారి వివాహానికి అడ్డంకిగా మారింది. ఆ విషయాన్ని సిద్ధార్థరెడ్డి 2002 ఫిబ్రవరి 23న ఫోన్ ద్వారా ప్రత్యూషకు చెప్పాడు. సాయంత్రం 5 గంటల సమయంలో పంజాగుట్టలో బ్యూటీపార్లర్‌లో ఉన్న ప్రత్యూషను వెంటబెట్టుకుని కారులో బయటికి వెళ్లాడు. రాత్రి 7.308 గంటల సమయంలో ఇద్దరూ ప్రాణాపాయస్థితిలో బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రికి వచ్చి చేరారు. ప్రత్యూష 24వ తేదీన కన్నుమూశారు. సిద్ధార్థరెడ్డి మార్చి 9న డిశ్చార్జి అయ్యారు.