Reading Time: < 1 minute

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ గుర్తింపు కోసం ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. కెటిఆర్ గుర్తింపు కోసం తాపత్రయపడుతున్నారని, తనను ఎవరూ గుర్తించడం లేదన్న బాధతో గుర్తింపు కోసం రాహుల్‌ను నిందించడం అలవాటు గా మార్చుకున్నారని ఆమె సోమవారం తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. రాహుల్ గాంధీని తిడితే పెద్ద లీడర్ అవుతానని కెటిఆర్ భావిస్తున్నారని ఆమె విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తేనే ఓర్వలేకపోతున్నారని ఆమె విమర్శించారు.

బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడాలంటే కెటిఆర్ వణికిపోతారని ఆమె అన్నారు.ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పథకాన్ని సమర్దవంతంగా అమలు చేస్తున్నదని ఆమె వివరించారు. పథకాల చట్టబద్ధత గురించి కెటిఆర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.బిఆర్‌ఎస్ నాయకుల డ్రగ్స్ దందా గురించి తొలుత కెటిఆర్ మాట్లాడితే బాగుంటుందన్నారు. మీ వారసత్వాన్ని మీ నాయకులు ఫౌం హౌస్‌లలో కొనసాగిస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ మీ నేత పై చర్యలు తీసుకోకపోవడంతోనే మీరు డ్రగ్స్ ను ఎలా ప్రోత్సహిస్తున్నారో అర్థం అవుతున్నదని మంత్రి సీతక్క తెలిపారు.