Reading Time: < 1 minute

ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు ఆయా పార్టీలు అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు బిజెపి సోమవాంనాడు 144 మంది అభ్యర్థులతో తొలిజాబితా విడుదల చేసింది. సీనియర్ నేత సువేంధు అధికారి రెండు నియోజకవర్గాల నుంచి బరిలో దిగుతున్నారు. మరోసారి సిఎం మమతా బెనర్జీతో ఎన్నికల గోదాలో తలపడుతున్నారు. కోల్‌కతాలోని భబనిపూర్ నియోజకవర్గం నుంచి సువేంధును బిజెపి బరిలోకి దింపుతోంది. మమత ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నందిగ్రామ్ నుంచి కూడా సువేంధుకు మరోసారి బిజెపి టికెట్ కేటాయించింది. ఇక ఖరగ్‌పూర్ సదర్ నుంచి దిలీప్ ఘోష్,

మరో సీనియర్ నాయకుడు బిమన్ మహతోను సల్బోని, పశ్చిమ మేదినీపూర్‌ల నుంచి బరిలోకి దింపుతున్నారు. దక్షిణ కోల్‌కతాలోని రాస్‌బిహారీ నుంచి స్వపన్‌దాస్ గుప్తా, కాంతి ఉత్తర్ నుంచి సుమితా సిన్హా, హుగ్లీ జిల్లాలోని పుర్‌సురాహ్ నుంచి బిమన్ ఘోష్ పోటీ చేస్తున్నారు.గత ఎన్నికల్లో నందిగ్రామ్‌లో సువేంధు అధికారి చేతిలో ఓటమిపాలైన తర్వాత 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో భబనిపూర్ నుంచి మమత పోటీ చేసి గెలిచారు. 294మంది సభ్యులున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 4న కౌంటింగ్ నిర్వహిస్తారు.

192 మందితో లెఫ్ట్ ఫ్రంట్ తొలి జాబితా..

పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు వామపక్షాలు సోమవారం నాడు 192 మందితో తొలి జాబితా విడుదల చేశాయి. రాజ్యసభ సభ్యుడు రంజన్ భట్టాచార్యను జాదవ్‌పూర్ నుంచి బరిలోకి దింపుతుండగా, మీనాక్షి ముఖర్జీ ఉత్తరపార నుంచి పోటీ చేస్తున్నారు. 2021లో మీనాక్షి నందిగ్రామ్ నుంచి బరిలో దిగి సువేంధు అధికారి చేతిలో ఓటమిపాలయ్యారు. ఇంకా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రముఖుల్లో సబినా యాస్మిన్(కాళీగంజ్) ఉన్నారు. మిగతా స్థానాలకు రెండు మూడు రోజుల్లో తుది జాబితా విడుదల చేస్తామని లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ బిమన్ బోస్ వెల్లడించారు.