
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (BJP) తమ అభ్యర్థుల తొలి జాబితాలను ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ లో 144 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను సోమవారం బిజెపి విడుదల చేసింది. ముఖ్యమంత్రి మమత బెనర్జీపై సువేందు అధికారిని బరిలోకి దించింది.
ఇక, కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం 47 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఈసారి కేరళలో తన ఉనికిని బలోపేతం చేసుకునే ప్రయత్నంలో భాగంగా వ్యూహాలు రచిస్తున్న బిజెపి.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యక్తులను పార్టీ ఎంపిక చేసింది. ఈ జాబితాలో మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ‘నేమోమ్’ స్థానం నుండి పోటీ చేయనున్నారు. మరొక సీనియర్ నాయకుడు, కె. సురేంద్రన్, ‘మంజేశ్వర్’ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా ప్రకటించబడ్డారు.
ఈ జాబితాలో బీజేపీ మహిళా మోర్చా మాజీ జాతీయ అధ్యక్షురాలు శోభా సురేంద్రన్ కూడా ఉన్నారు. ‘పాలక్కాడ్’ నియోజకవర్గం నుండి ఆమె పోటీ చేయనున్నారు. ‘కోజికోడ్ ఉత్తర’ నియోజకవర్గం నుండి నవ్య హరిదాస్‌ను పార్టీ బరిలోకి దింపగా, ‘త్రిశూర్’ స్థానం నుండి పద్మజా వేణుగోపాల్ పోటీ చేయనున్నారు. కేంద్ర మంత్రిగా సేవలందించిన సీనియర్ నాయకుడు వి. మురళీధరన్, ‘కజకూట్టం’ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ‘పూంజర్’ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు పి.సి. జార్జ్‌కు పార్టీ టికెట్ కేటాయించింది.